భయంకరమైన ఆర్థిక, మానవతా సంక్షోభం దిశగా ఆఫ్ఘనిస్థాన్‌

  • తాలిబన్ల పాలనలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు
  • విదేశీ సహకారం కరవవడంతో ఆర్థిక సంక్షోభం
  • సెప్టెంబరు నాటికి నిండుకోనున్న ఆహార నిల్వలు
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో భయంకరమైన మానవతా సంక్షోభం కనిపిస్తోంది. తాలిబన్ల క్రూరమైన నిబంధనలు, వాటిని వ్యతిరేకిస్తే భయంకరమైన శిక్షలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తమకు జరిగే అన్యాయం గురించి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని అసందిగ్ధ పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. దీనికితోడు అమెరికా సైన్యం దేశాన్ని వీడటంతో ఆఫ్ఘనిస్థాన్‌కు ఆర్థిక సహకారం లేకుండా పోయింది.

ఇంతకు ముందు ఆఫ్ఘన్ బడ్జెట్‌లో 75 శాతాన్ని అమెరికా నిర్వహించేది. మిలటరీ నిధులు మొత్తం అమెరికా చేతుల్లోనే ఉండేవి. ఇప్పుడు సడెన్‌గా అమెరికా ఈ దేశాన్ని వదిలేయడంతో ఈ డబ్బు తాలిబన్ల చేతికి అందని పరిస్థితి. దీనికి తోడు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఆఫ్ఘనిస్థాన్ వాటాను తాలిబన్లకు అందివ్వడానికి ఐఎంఎఫ్ నిరాకరించింది. దీంతో ఆఫ్ఘన్ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా సాగుతోంది.

ఇదే సమయంలో 1.4 కోట్ల మంది ఆప్ఘన్ ప్రజలు ఆకలితో అల్లాడే పరిస్థితులు భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆఫ్ఘనిస్థాన్‌లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడ పంటల దిగుబడి 40 శాతం మేర తగ్గిపోయింది. ఆర్థిక సహకారం లేని దేశంలో కరవు కూడా ఉండటంతో ఇక్కడి ప్రజలు ఆకలితో నకనకలాడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్‌పీ) అంచనాల ప్రకారం, ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న ఆహార నిల్వలు సెప్టెంబరు చివరికల్లా నిండుకుంటాయి.

ప్రస్తుతానికి తాము 27వేల మెట్రిక్ టన్నులు ఆహారాన్ని సేకరించామని, కానీ ఇంకో 54వేల మెట్రిక్ టన్నులు ఆహార పదార్థాలు అవసరమవుతాయని డబ్ల్యూఎఫ్‌పీ తెలిపింది. వచ్చేది చలికాలం కావడంతో ఆఫ్ఘనిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు మంచుతో నిండిపోతాయని, ఇలాంటి సమయంలో ఆహారాన్ని ప్రతిచోటకూ పంపడం కూడా సవాలేనని నిపుణులు అంటున్నారు.

ఆఫ్ఘన్ ప్రజలను ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలంటే.. విదేశాల సాయం ఉండాల్సిందే. కానీ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాలా? వద్దా? అనే విషయంపైనే అంతర్జాతీయ సమాజం మల్లగుల్లాలు పడుతున్న వేళ ఆఫ్ఘన్ ప్రజల భవిష్యత్తు ఏమవుతుందో మరి.


More Telugu News