కేరళలో కొత్తగా 30 వేల కరోనా కేసులు

  • 181 కరోనా మరణాలు కూడా నమోదు
  • అత్యధికంగా త్రిస్సూర్‌లో 3,832
  • కరోనా బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం
దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక్కడ గడిచిన 24 గంటల్లో 30,196 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 42,83,494కు చేరింది. గత శుక్రవారం నుంచి కేరళలో ఒక్కరోజులో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

ఈ క్రమంలో రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన టెస్ట్ పాజిటివిటీ రేట్ (టీపీఆర్) మళ్లీ పెరిగింది. కొన్నిరోజులుగా 16 శాతం కన్నా తక్కువగా ఉన్న ఈ రేటు బుధవారం నాడు 17.63 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,79,295 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 40,21,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,39,480 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని సమాచారం.

గడిచిన 24 గంటల్లో కేరళలో 181 కరోనా మరణాలు కూడా సంభవించినట్లు అధికారులు తెలిపారు. వారి మరణానికి సానుభూతి తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో త్రిస్సూర్‌లో అత్యధికంగా 3,832 కరోనా కేసులు నమోదవగా.. ఎర్నాకుళం, కోజికోడ్, తిరువనంతపురం తదితర జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే కొత్తగా నమోదైన కేసుల్లో 130 మంది హెల్త్ వర్కర్లు కాగా, 190 మంది రాష్ట్రం వెలుపల నుంచి వచ్చారని సమాచారం. మిగిలినవారిలో 28,617 మందికి పరిచయస్తుల ద్వారా కరోనా సోకినట్లు గుర్తించారు. 1,259 కేసుల్లో పేషెంట్లకు కరోనా ఎలా సోకిందీ ఇంకా తెలియరాలేదు.


More Telugu News