గన్నవరం ఎయిర్ పోర్టులో నారా లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేశ్
  • ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు
  • లోకేశ్ ను పోలీసులు ఎక్కడకు తీసుకెళ్తారనే అంశంపై ఉత్కంఠ
టీడీపీ నేత నారా లోకేశ్ నరసరావుపేట పర్యటన ఉత్కంఠభరితంగా మారింది. గుంటూరు జిల్లా గోళ్లపాడులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

అయితే, లోకేశ్ ను ఎయిర్ పోర్టు నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. విమానాశ్రయం లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. అక్కడి నుంచి ఆయనను ఎక్కడకు తరలిస్తారనే ఉత్కంఠ నెలకొంది.

 మరోవైపు నారా లోకేశ్ వస్తున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని... అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు. మరోవైపు టీడీపీ కీలక నేతలందరినీ పోలీసులు ఇప్పటికే గృహనిర్బంధం చేశారు. లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.  


More Telugu News