రాజస్థాన్ వివాహ బిల్లు బాల్యవివాహాలను ప్రోత్సహించేలా ఉందంటూ నిరసనలు

  • వివాహాలన్నీ రిజిస్టర్ చేయాలని చట్టం తెచ్చిన రాజస్థాన్
  • బాల్యవివాహాలను తల్లిదండ్రులు రిజిస్టర్ చేసే వెసులుబాటు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సామాజిక సంస్కర్తలు
దేశంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే రాష్ట్రం రాజస్థాన్. ఈ దురాచారాన్ని రూపుమాపడం కోసం స్థానిక సంస్కర్తలు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. అయితే ఇక్కడి ప్రభుత్వం ఇటీవల తెచ్చిన బిల్లు తమ కృషికి గండి కొట్టేలా ఉందని సామాజిక సంస్కర్తలు ఆరోపిస్తున్నారు. రాజస్థాన్‌లో తాజాగా అసెంబ్లీ పాస్ చేసిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ బిల్లు ప్రకారం, రాష్ట్రంలో జరిగే వివాహాలన్నింటినీ రిజిస్టర్ చేయాలి. అవి బాల్యవివాహాలైనా సరే!

బాలిక తల్లిదండ్రులో.. లేదంటే గార్డియనో వచ్చి బాల్యవివాహాలను నమోదు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బాల్యవివాహాలకు చట్టబద్ధత లభించినట్లే కదా? అని సామాజిక కార్యకర్తలు, ఎన్జీవోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాల్యవివాహం అనే ఆచారం చాలా ఘోరమైన దురాచారమని, ఇది పిల్లల భవిష్యత్తును అంధకార మయం చేస్తుందని వారు అంటున్నారు. అందుకే బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఏళ్లతరబడి పోరాటాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

ఇలాంటి వారికి అండగా నిలబడి, ఈ వివాహాలు జరగకుండా నిలువరించాల్సిన ప్రభుత్వం ఇలాంటి చట్టాలను తీసుకురావడం బాధాకరమని సంస్కర్తలు వాదిస్తున్నారు. ఈ చట్టాన్ని అమలు చేయడమంటే బాల్యవివాహాలను దొడ్డిదారిలో ప్రభుత్వం కూడా సమర్థించినట్లే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ ఆదేశాల మేరకే తాము కొత్త చట్టం చేశామని రాజస్థాన్ ప్రభుత్వం అంటోంది. ప్రస్తుతం సమాజంలో బాల్యవివాహాల దురాచారం పూర్తిగా తొలగిపోలేదని, ఇలాంటి పెళ్లిళ్ల వల్ల జీవితం కోల్పోయిన ఎంతోమంది చిన్నారులను కాపాడేందుకే కొత్త చట్టం చేశామని ప్రభుత్వం అంటోంది. దీనిపై బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సంగీతా బెనివాల్ స్పందించారు.

తాజా చట్టం ఎక్కడా బాల్యవివాహాలను ధ్రువీకరించడం కానీ, ప్రోత్సహించడం కానీ చేయడం లేదని బెనివాల్ అభిప్రాయపడ్డారు. ‘‘బాల్యవివాహం జరిగి, చిన్నతనంలోనే ఒక బాలిక తన భర్తను కోల్పోతే ఆమె పరిస్థితి ఏంటి? మెట్టింట్లో ఆమె హక్కులను ఎవరు పరిరక్షిస్తారు? ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన చట్టం మహిళలను రక్షించేందుకేకానీ, బాల్యవివాహాలను ప్రోత్సహించడం కోసం కాదు’’ అని ఆమె స్పష్టం చేశారు.


More Telugu News