తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఆసుప‌త్రిలో చేరిన బిల్ క్లింట‌న్

  • ర‌క్తంలో ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా చికిత్స‌
  • మూడు రోజులుగా ఆసుప‌త్రిలోనే బిల్ క్లింట‌న్
  • ప్రత్యేక వైద్య బృందం ఆధ్వ‌ర్యంలో చికిత్స 
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ (75) అనారోగ్య కార‌ణాల‌తో ఆసుప‌త్రిలో చేరారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ప్ర‌తినిధులు మీడియాకు ఆల‌స్యంగా తెలిపారు. ర‌క్తంలో ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా ఆయ‌న తీవ్ర అస్వస్థతకు గురైన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయనకు దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ఆసుప‌త్రిలో మూడు రోజులుగా చికిత్స అందుతోంది.

ప్రస్తుతం ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. క్లింట‌న్‌కు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. అమెరికా అధ్య‌క్షులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన నేత‌ల్లో బిల్‌క్లింటన్ కు గొప్ప పేరు ఉంది. ఆయ‌న  1993-2001 మ‌ధ్య  రెండుసార్లు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు.

2001 తర్వాతి నుంచి ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. 2004లో ఆయనకు నాలుగుసార్లు బైపాస్‌ సర్జరీ చేశారు. అంతేకాదు,  ఊపిరితిత్తులు దెబ్బతినడంతో 2005లోనూ తిరిగి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి ఆప‌రేష‌న్ చేసి, రెండు స్టెంట్లు అమర్చారు.


More Telugu News