రాయలసీమ నీటి కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పోరాడాలి: బాలకృష్ణ

  • సీమ ప్రాజెక్టులపై టీడీపీ నేతల సదస్సు
  • హాజరైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ
  • సీమ పరిస్థితిపై ఆవేదన
  • ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని వెల్లడి
రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై టీడీపీ నేతలు నేడు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ నీటి కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పోరాటం చేద్దామని అన్నారు. హర్యానా తరహాలో ఢిల్లీలో ఉద్యమం చేపట్టాలని తెలిపారు. ఒకప్పుడు రతనాల సీమగా ఉన్న రాయలసీమ నేడు నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. రాయలసీమకు మిగులు జలాలు కాదని, నికర జలాలు ఇవ్వాలని బాలకృష్ణ స్పష్టం చేశారు.

నాడు రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, సీమ కోసం హంద్రీనీవా తీసుకువచ్చారని వివరించారు. కానీ హంద్రీనీవా ద్వారా నీళ్లిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. చెరువులకు పుష్కలంగా నీరు అందించడంలేదని పేర్కొన్నారు. పైగా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని బాలకృష్ణ మండిపడ్డారు.


More Telugu News