జేసీబీలతో దుకాణాల తొలగింపు.. ధర్మవరం కూరగాయల మార్కెట్‌లో ఉద్రిక్తత

  • కొత్తగా మార్కెట్ భవనాల నిర్మాణం కోసం అధికారుల ప్రణాళిక
  • వ్యాపారులు ఒక్కొక్కరు రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలంటూ నోటీసులు
  • చెల్లించని వారి దుకాణాల తొలగింపు
  • ఆందోళనకు దిగిన వ్యాపారులు, టీడీపీ నేతల అరెస్ట్
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో దుకాణాల తొలగింపు ఉద్రిక్తతకు కారణమైంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున మునిసిపాలిటీ అధికారులు జేసీబీలతో మార్కెట్‌లోని దుకాణాల తొలగింపు ప్రారంభించారు. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో కొత్తగా మార్కెట్ భవనాల నిర్మాణం కోసం పురపాలక శాఖ ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని వ్యాపారులకు నోటీసులు ఇచ్చింది.

డిపాజిట్ చెల్లించని వ్యాపారుల దుకాణాలను తొలగించాలని నిర్ణయించుకున్న అధికారులు నేడు జేసీబీలతో 40కిపైగా దుకాణాలను తొలగించారు. అయితే, రెండు దుకాణాలకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడంతో వాటిని మాత్రం పక్కనపెట్టి మిగతా వాటిని తొలగించారు. మరోవైపు, తాము అంతమొత్తంలో డిపాజిట్ చెల్లించలేమంటూ వ్యాపారులు ఆందోళనకు దిగగా, టీడీపీ నేతలు వారికి మద్దతుగా నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారులతోపాటు ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు.


More Telugu News