హుజూరాబాద్ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి రావాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  • హుజూరాబాద్ లో ఉప ఎన్నిక
  • కొనసాగుతున్న పోలింగ్
  • మధ్యాహ్నం 1 గంట వరకు 45.63 శాతం ఓటింగ్ నమోదు
  • సమర్థుడైన నేతను ఎన్నుకోవాలన్న కిషన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 45.63 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. నేడు జరిగే ఉప ఎన్నికలో ఓట్లు వేసేందుకు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉన్నతమైన పాలన కోసం సమర్థుడికి ఓటు వేయాలని సూచించారు.

కాగా, హుజూరాబాద్ టౌన్ లో హనుమాన్ ఆలయం వద్ద డబ్బులు పంచుతున్న ఓ వ్యక్తిని బీజేపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడు హుజూరాబాద్ కు చెందిన వ్యక్తి కాడని బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.  

అటు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పీఆర్ఓ చైతన్యను నెంబర్ ప్లేట్ లేని వాహనంలో తిరుగుతున్నాడంటూ మర్రిపల్లిగూడెంలో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది. ఇదిలావుంచితే, తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లను పరిశీలించారు. 


More Telugu News