పునీత్ మరణ వార్త చదువుతూ లైవ్ లో భోరున విలపించిన టీవీ చానల్ యాంకర్

  • గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ మరణం
  • తీవ్ర భావోద్వేగాలకు లోనైన టీవీ యాంకర్
  • ఈ ఉదయం పూర్తయిన పునీత్ అంత్యక్రియలు
  • పునీత్ కు అంతిమసంస్కారాలు నిర్వహించిన వినయ్
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణవార్త అన్ని వర్గాల వారినీ కలచివేసింది. సినీ నటుడిగానూ, సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఆయన కర్ణాటక ప్రజలపై చెరగని ముద్రవేశారు. ఎన్నో పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు పునీత్ రాజ్ కుమార్ అన్నీ తానై నిలిచారు. ఆయన ఆకస్మిక మరణంతో ఒక గొప్ప అండను కోల్పోయిన ఆపన్నుల వేదన వర్ణనాతీతం.

కాగా, పునీత్ రాజ్ కుమార్ మరణవార్తను చదువుతూ ఓ టీవీ చానల్ యాంకర్ లైవ్ లో తీవ్ర భావోద్వేగాలకు గురైన వైనం తాజాగా వెల్లడైంది. పునీత్ ఇక లేరన్న వార్త చదువుతూ ఆమె తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుని భోరున విలపించారు. చాలాసేపటి వరకు మామూలు మనిషి కాలేకపోయారు.


పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఇవాళ ఉదయం బెంగళూరు కంఠీరవ స్టూడియోస్ లో జరిగాయి. పునీత్ కు ఆయన అన్న కుమారుడు వినయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పునీత్ కు ఇద్దరూ కుమార్తెలే కావడంతో, అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు వినయ్ రాజ్ కుమార్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించారు. వినయ్ కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోనే. వినయ్ కెరీర్ ఊపందుకోవడానికి పునీత్ ఎంతో సహకారం అందించాడు.

కన్నడ చిత్ర పరిశ్రమ శాండల్ వుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే కొద్దిమంది హీరోల్లో పునీత్ ఒకరు. ఆయన నటుడు మాత్రమే కాదు. గాయకుడు కూడా. తాను పాడినందుకు తొలినాళ్లలో పారితోషికం తీసుకునేవారు కాదు. అయితే, నిర్మాతల ఒత్తిడితో పారితోషికం తీసుకోవడం ప్రారంభించిన పునీత్... ఆ డబ్బు మొత్తాన్ని సామాజిక సేవ కోసం వినియోగించేవారు.

సాధారణ సమయాల్లో తానొక స్టార్ ను అని కాకుండా, మామూలు వ్యక్తిలా నిరాడంబరంగా ఉండే పునీత్... తన స్టార్ డమ్ వల్ల ఏదైనా మంచి పని జరుగుతుందనుకుంటే కచ్చితంగా ముందుకు వచ్చేవారు. తన తండ్రి దివంగత రాజ్ కుమార్ పేరిట ఏర్పాటు చేసిన డాక్టర్ రాజ్ కుమార్ ట్రస్టు తరఫున పునీత్ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. గతేడాది కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. రాష్ట్రంలో కన్నడ మీడియంలో నడిచే స్కూళ్లకు క్రమం తప్పకుండా విరాళాలు పంపించేవారు.

మైసూరులోని  శక్తిధామ ఆశ్రమంలో తన తల్లి పార్వతమ్మతో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పునీత్ విరాళాలతో 26 అనాథాశ్రమాలు, ఉచిత పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయంటే ఆయన పెద్దమనసు ఇట్టే అర్థమవుతుంది. తన మరణానంతరం కూడా కళ్లను దానం చేసి చిరకీర్తిని అందుకున్నాడు. ఆయన నటించింది 29 సినిమాలే అయినా, తన దాతృత్వంతో అంతకుమించిన మానవతావాదిగా పేరుతెచ్చుకున్నారు. అయితే 46 ఏళ్ల వయసుకే ఆయనకు కాలం చెల్లిపోవడం అభిమానుల గుండెకోతకు కారణమవుతోంది.


More Telugu News