ఈటల రాజేందర్ కు మద్దతు ఇవ్వక తప్పలేదు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • శత్రువుకు శత్రువు మిత్రుడు అనే విధంగా పని చేయాల్సి వచ్చింది
  • టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఈటలకు మద్దతుగా వ్యవహరించాం
  • ఈటల 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు
హుజూరాబాద్ ఎన్నికలు, ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని చెప్పారు. తెలంగాణలో సంచలన ఫలితాన్ని మనం చూడబోతున్నామని అన్నారు.

ఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డిందని కోమటిరెడ్డి చెప్పారు. ఐదు నెలల్లోనే టీఆర్ఎస్ రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మద్యం ఏరులై పారిందని అన్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ కు అదిరిపోయే తీర్పును హుజూరాబాద్ ప్రజలు ఇవ్వనున్నారని చెప్పారు.

శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతం ప్రకారం ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి, చివరకు టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందనే తాము కాస్త వెనక్కి తగ్గామని చెప్పారు. ఈటలకు పరోక్షంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. నాగార్జునసాగర్, దుబ్బాక ఎన్నికల్లో పని చేసినట్టు హుజూరాబాద్ లో తాము చేయలేదని చెప్పారు.


More Telugu News