మరి, ఈ నాయకులను ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి?: వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్

  • 4 వేల టన్నుల గంజాయి రాష్ట్రం నుంచి వెళుతోంది   
  • పిల్లలకు పాలు తాగించినట్టు పెద్దలతో మద్యం తాగిస్తున్నారు
  • వైసీపీ నాయకులకు భూమి పిచ్చి పట్టుకుంది
  • మళ్లీ అధికారంలోకి వస్తే ఇళ్లను కూడా లాగేసుకుంటారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన గంజాయిపై మాట్లాడుతూ.. ముంబై తీరంలోని క్రూయిజ్ నౌకలో తక్కువ మోతాదులో డ్రగ్స్ దొరికినందుకు కొన్ని ఆధారాలతో షారుఖ్ కుమారుడిని కొన్ని రోజులపాటు జైల్లో పెట్టారని, మరి ఒక పంట కాలంలో దాదాపు 4 వేల టన్నుల గంజాయి రాష్ట్రం నుంచి బయటకు వెళ్తుంటే ఎంతమంది నాయకులను ఎన్ని రోజులు జైల్లో పెట్టాలని ప్రశ్నించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనసేన కార్యకర్తలతో విశాఖపట్టణంలో నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానుల అంశంపై మాట్లాడుతూ.. అదొక మిథ్య అని విమర్శించారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక కేంద్రంగా మార్చలేకపోయారని విమర్శించారు. వైసీపీ పాలనలో గంజాయి సాగు రెట్టింపు అయిందన్న పవన్.. అది ఏ మేరకు పెరిగిందో పోలీసులే చెప్పాలని అన్నారు. గంజాయి మొక్కను వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర మొక్కగా మార్చేసిందని దుయ్యబట్టారు.

ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపైనా పవన్ అనుమానాలు వ్యక్తం చేశారు. గంజాయి కలిపిన సారాను కూడా విక్రయిస్తున్నారని ఆరోపించారు. పిల్లలకు పాలు తాగించినట్టుగా ఏపీలో పెద్దలకు మద్యం తాగిస్తున్నారని మండిపడ్డారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు బూమ్‌బూమ్ బీరు తాగుతావా? ప్రెసిడెంట్ 2 మెడల్ తాగుతావా? అని అమ్ముతున్నారని ధ్వజమెత్తారు.

ఎయిడెడ్ పాఠశాలలను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న ప్రభుత్వం నెల్లూరులో తాను ఇంటర్ చదివిన కళాశాలపైనా దృష్టిపెట్టిందన్నారు. ప్రతి విద్యార్థికి మేనమామగా ఉంటానని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు వారు చదువుతున్న ఎయిడెడ్ పాఠశాలలను కూడా అమ్మేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లను కూడా లాగేసుకుంటారని హెచ్చరించారు.

వైసీపీ నేతలకు భూమి పిచ్చి తప్ప మరోటి లేదని, విశాఖలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సైనికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కొందరు కార్యకర్తలు విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లగా.. తీవ్రంగా స్పందించారు. 2024 నుంచి వచ్చే ఐదు సార్వత్రిక ఎన్నికల్లోనూ తమతో పోరాడేందుకు సిద్ధమైతేనే బెదిరించాలని వైసీపీ నేతలను పవన్ హెచ్చరించారు.


More Telugu News