టీమిండియా బాధ్యతల నుంచి తప్పుకోనున్న రవిశాస్త్రి అండ్ కో ముందు బంపర్ ఆఫర్!

  • టీ20 వరల్డ్ కప్ తో ముగియనున్న శాస్త్రి పదవీకాలం
  • టీమిండియా కొత్త కోచ్ గా ద్రావిడ్
  • శాస్త్రితో పాటే తప్పుకోనున్న బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లు
  • అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న సీవీసీ క్యాపిటల్స్
  • సమర్ధులైన కోచింగ్ స్టాఫ్ కోసం అన్వేషణ!
టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ ల పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగియనుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత బీసీసీఐ ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ నేపథ్యంలో, టీమిండియా కోచ్ గా బాధ్యతల నుంచి తప్పుకున్నాక రవిశాస్త్రి అండ్ కో భవితవ్యం ఏంటన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, రవిశాస్త్రి, ఆయన బృందం ముందు ఓ బంపర్ ఆఫర్ నిలిచినట్టు తెలుస్తోంది.

ఇటీవలే ఐపీఎల్ లోకి కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లను చేర్చిన సంగతి తెలిసిందే. వీటిలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి పనిచేయాలంటూ రవిశాస్త్రికి ప్రతిపాదనలు వెళ్లినట్టు సమాచారం. రవిశాస్త్రి తన సమ్మతి తెలిపితే చాలు... షరా మామూలుగానే భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్ కూడా అహ్మదాబాద్ జట్టు సహాయక బృందంలో సభ్యులవుతారు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రమోటర్లు ఇటీవలే దుబాయ్ లో రవిశాస్త్రి బృందాన్ని సంప్రదించారన్న విషయం వెల్లడైంది.

అయితే మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. రవిశాస్త్రి టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించకముందే వరల్డ్ టాప్ కామెంటేటర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన మళ్లీ కామెంట్రీ బాక్స్ లో కూర్చుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఆయన ఐపీఎల్ కోచ్ అయ్యే అవకాశాలు ఉండవు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన కింద రవిశాస్త్రి ఏదో ఒకటే ఎంచుకోవాల్సి ఉంటుంది. బోర్డు కామెంటేటర్ గా రవిశాస్త్రికి గతంలో భారీగానే గిట్టుబాటు అయింది.

అహ్మదాబాద్ ఫ్రాంచైజీ యజమాన్యం సంస్థ సీవీసీ క్యాపిటల్స్ మాత్రం వీలైనంత త్వరగా జట్టును నిర్మించాలని, జట్టు పరంగా దృఢమైన సంస్కృతి ఏర్పరచాలని భావిస్తోంది. రవిశాస్త్రి వంటి ఫ్రొఫెషనల్ అయితే తమ జట్టుకు సరైన స్టార్ట్ లభిస్తుందని సీవీసీ యోచన.

శాస్త్రి 2014లో టీమిండియా కోచ్ గా బాధ్యతలు అందుకున్నారు. మధ్యలో ఓ ఏడాది విరామం తప్ప, నేటి వరకు కోచ్ గా ఉన్నారు. జట్టు విజయాల్లో ఆయన పాత్ర కూడా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లోనూ, టెస్టు క్రికెట్లోనూ కోహ్లీ సేన అనేక ఘనతలు సాధించడం వెనుక శాస్త్రి కృషి ఎనలేనిది. ఈ ట్రాక్ రికార్డే సీవీసీ క్యాపిటల్స్ ను ఆకర్షిస్తోంది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.5,600 కోట్లతో కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి భారీగానే ముట్టజెప్పనుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మరి రవిశాస్త్రి తన ఓటు ఎటు వేస్తాడో చూడాలి!

ఈ డీల్ కార్యరూపం దాల్చితే రవిశాస్త్రి పారితోషికం రూపంలో భారీగా పొందనున్నారు. టీమిండియా కోచ్ గా ఏడాది పనిచేస్తే వచ్చే మొత్తానికి రెట్టింపు మొత్తాన్ని ఐపీఎల్ లో రెండు నెలల్లోనే అందుకునే అవకాశాలు ఉన్నాయి.


More Telugu News