టీమిండియాకు బుమ్రాను కెప్టెన్ చేయాలంటున్న మాజీ పేసర్

  • అన్ని అర్హతలూ ఉన్నాయన్న ఆశిష్ నెహ్రా
  • స్థిరంగా రాణిస్తున్నాడని ప్రశంస
  • పేసర్లు కెప్టెన్ కాకూడదని రూల్ బుక్ లో ఉందా? అంటూ ప్రశ్న
ఈ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నాడు. వన్డేలకూ కెప్టెన్ ను మార్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి, ఆ తర్వాత కెప్టెన్ ఎవరు? ఆ వరుసలో ముందున్నది రోహిత్ శర్మ. ఇప్పటికే టీ20 కెప్టెన్ గా హిట్ మ్యాన్ కన్ఫర్మ్ అయ్యాడు. కొందరు కేఎల్ రాహుల్ కు ఇవ్వాలంటున్నారు. ఇంకొందరైతే రిషభ్ పంత్ ను కెప్టెన్ చెయ్యాలంటున్నారు.

మరి, టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఎవరి పేరు చెప్తున్నాడో తెలుసా? టీమిండియా పేస్ బాధ్యతలను మోస్తున్న జస్ ప్రీత్ బుమ్రా పేరును సిఫార్సు చేస్తున్నాడు. క్రిక్ బజ్ చర్చాగోష్ఠి సందర్భంగా.. జట్టుకు నాయకుడయ్యే అన్ని అర్హతలూ బుమ్రాకున్నాయని నెహ్రా చెప్పాడు. పేసర్లు కెప్టెన్ కాకూడదని ఏ రూల్ బుక్ లోనైనా రాశారా? అంటూ ప్రశ్నించాడు.

‘‘రోహిత్ శర్మ కాకుండా.. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రపంచమంతా పంత్ తిరిగేశాడు. ఆటగాళ్లకు డ్రింక్స్ తీసుకెళ్లాడు. జట్టులోకి వచ్చినా కొన్నిసార్లు పక్కనపెట్టేశారు. మయాంక్ అగర్వాల్ కు గాయం కావడంతో రాహుల్ కు చాన్స్ వచ్చింది. కానీ, బుమ్రా అలా కాదు. అన్ని ఫార్మాట్లలోనూ స్థిరంగా రాణిస్తున్నాడు. ఆటను అతడు బాగా అర్థం చేసుకోగలడు’’ అని చెప్పుకొచ్చాడు.


More Telugu News