పునీత్ రాజ్ కుమార్ మృతికి ఫ్యామిలీ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదులు

  • గత నెల 29న పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత
  • గుండెపోటుతో మరణించిన కన్నడ హీరో
  • తన తప్పేమీ లేదంటున్న డాక్టర్ రమణారావు
  • బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం తాలూకూ విషాదం నుంచి ఆయన అభిమానులు ఇంకా తేరుకోలేదు. కాగా, పునీత్ రాజ్ కుమార్ మరణానికి ఫ్యామిలీ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ అభిమానులు పోలీసులను ఆశ్రయించారు. పునీత్ ఫ్యామిలీ డాక్టర్ రమణారావును వెంటనే అరెస్ట్ చేయాలంటూ బెంగళూరు సదాశివనగర పోలీసులకు రెండు ఫిర్యాదులు అందాయి.

దాంతో డాక్టర్ రమణారావు స్పందించారు. అక్టోబరు 29న పునీత్, ఆయన భార్య తన క్లినిక్ కు వచ్చారని, ప్రాథమిక చికిత్స చేసి నగరంలోని విక్రమ్ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించానని వెల్లడించారు. వైద్యచికిత్స పరంగా తన లోపం ఏమీలేదని ఆయన స్పష్టం చేశారు.

ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు డాక్టర్ రమణారావు క్లినిక్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్ అభిమానులు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని భావించి భద్రత కల్పించారు. జిమ్ లో వర్కౌట్లు చేస్తూ అస్వస్థతకు గురైన పునీత్ రాజ్ కుమార్ విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.


More Telugu News