రోడ్డు వేయలేదో.. ఆ ఎమ్మెల్యే మా చేతుల్లో చచ్చినట్టే: యూపీలో మహిళల హెచ్చరిక

  • మేం ఓట్లు వేస్తేనే అసెంబ్లీకి వెళ్లారు
  • ఎన్నికైన తర్వాత ఒక్క రోడ్డు కూడా వేయించలేకపోయారు
  • ఆయనకు ఓట్లు అడిగే హక్కులేదు
  • రోడ్డు వేయకుంటే చెప్పులతో కొట్టి చంపేస్తాం
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవి కుమార్ సోంకర్‌కు మహిళలు అల్టిమేటం జారీ చేశారు. తమ ఓట్లతో గెలిచి అసెంబ్లీకి వెళ్లిన ఆయన తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని, గ్రామంలో వెంటనే రోడ్డు వేయించకపోతే చెప్పులతో కొట్టి చంపేస్తామని హెచ్చరించారు. మహదేవ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై ఎన్నికైన రవి సోంకర్‌ తీరుకు వ్యతిరేకంగా పలువురు మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే ఆయన అసెంబ్లీకి వెళ్లారని గుర్తు చేశారు. ఎన్నికైన తర్వాత గ్రామ ప్రజల కోసం ఒక్క రోడ్డు కూడా వేయించలేకపోయారని బీజేపీ మహిళా మోర్చా మాజీ మండలాధ్యక్షురాలు శకుంతల ఆగ్రహం వ్యక్తం చేశారు. రవికి మళ్లీ ఓట్లు అడిగే అర్హత లేదని, వెంటనే రోడ్డు వేయకుంటే చెప్పులతో కొట్టి చంపేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.


More Telugu News