భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు... యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ లను అరెస్ట్ చేయాలన్న నెటిజన్... స్పందించిన పోలీసులు

  • ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధేశ్యామ్
  • తొలి సాంగ్ విడుదల చేసేందుకు సన్నాహాలు
  • సాంకేతిక లోపం తలెత్తిందన్న చిత్రబృందం
  • హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసిన నెటిజన్
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాధేశ్యామ్. అయితే ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదలలో రెండుసార్లు జాప్యం జరిగింది. తొలుత ఇవాళ 5 గంటలకు విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. కానీ, దాన్ని రాత్రి 8 గంటలకు వాయిదా వేసింది. అప్పటికీ విడుదల చేయకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ నెటిజన్ దీనిపై హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు. "సర్ దయచేసి యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ లను అరెస్ట్ చేయండి" అంటూ ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశాడు. వారిద్దరూ అభిమానుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నాడు.

ఈ ట్వీట్ కు హైదరాబాద్ పోలీసులు స్పందించారు. 'స్థానిక పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి' అని సూచించారు. అంతకుముందు యూవీ క్రియేషన్స్ సాయంత్రం 5 గంటలకు పాట విడుదల కాకపోవడం పట్ల వివరణ ఇచ్చింది. సాంకేంతిక లోపం కారణంగానే పాట విడుదల చేయలేకపోతున్నామని, రాత్రి 8 గంటలకు లిరికల్ వీడియో రిలీజ్ చేస్తామని పేర్కొంది. అయితే అది కూడా జరగకపోవడంతో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.


More Telugu News