కుప్పం పురపాలక ఎన్నికలను అక్రమాలకు తావులేని విధంగా నిర్వహించాం: ఎస్ఈసీ నీలం సాహ్నీ

  • కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు
  • అక్రమాలు జరిగాయన్న టీడీపీ
  • పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్న ఎస్ఈసీ   
  • ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారని వెల్లడి
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ స్పందించారు. కుప్పం పురపాలక ఎన్నికలను అక్రమాలకు తావులేని విధంగా నిర్వహించామని తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. కుప్పంలో పోలింగ్ బూత్ వెలుపల చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే, పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని వెల్లడించారు.  

ఆయా పార్టీల ఏజెంట్లు పోలింగ్ బూత్ లలోనే ఉన్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ కుప్పంలోనే ఉండి శాంతిభద్రతలను స్వయంగా పర్యవేక్షించారని వివరించారు. ఎన్నికల పరిశీలకులు ప్రతి పోలింగ్ బూత్ కు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నిఘాలో పోలింగ్ జరిగిందని నీలం సాహ్నీ స్పష్టం చేశారు.  ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.


More Telugu News