కరోనాతో ఆస్తమా రోగులకు ముప్పు ఉండదా?

  • స్విన్ బర్న్ వర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం
  • ఆస్తమా రోగులకు కరోనా భయం అక్కర్లేదని వెల్లడి
  • వారిపై కరోనా ప్రభావం తక్కువేనని వివరణ
  • కారణాలు వెల్లడించిన పరిశోధకులు  
కరోనా మహమ్మారితో ఆస్తమా రోగులకు ముప్పు ఉండదా? అంటే.. ఉండదనే అంటున్నారు స్విన్ బర్న్ యూనివర్సిటీ పరిశోధకులు. ఉబ్బస రోగులు కరోనాతో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ రాకాసి వైరస్ ఉనికిలోకి వచ్చిన తొలినాళ్లలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే స్విన్ బర్న్ వర్సిటీ పరిశోధకులు ఆ భయమేమీ అక్కర్లేదని చెబుతున్నారు. ఆస్తమాతో బాధపడేవారు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులే కాదు, వారు కరోనా బారినపడే అవకాశాలు కూడా తక్కువేనట. మరణించే అవకాశాలు కూడా స్వల్పమేనని తాజా అధ్యయనంలో వెల్లడించారు.

సాధారణంగా ఆస్తమా రోగులకు వైద్యులు కార్టికో స్టెరాయిడ్ ఔషధాలు ఉపయోగిస్తుంటారు. ఇవి శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ల నుంచి ఊపిరితిత్తులను రక్షించి, వాటిని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. అందువల్లే కరోనా ప్రభావం ఆస్తమా రోగులపై పెద్దగా పడదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మందుల వాడకం కారణంగా ఆస్తమా రోగుల్లో ఏర్పడే వ్యాధినిరోధక శక్తి.. కరోనా క్రిములపై సమర్థంగా పోరాడేందుకు ఉపకరిస్తుందని తెలిపారు.

ముఖ్యంగా, మానవ శరీరంలో కరోనా వ్యాప్తికి దోహదపడే ఏసీఈ-2 అనే జన్యువు ఆస్తమా రోగుల్లో ఏమంత చురుగ్గా ఉండదని పరిశోధకులు గుర్తించారు. కరోనా మహమ్మారి ఆస్తమా రోగుల్లో ప్రవేశించినా అది ఇన్ఫెక్షన్ గా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉండేందుకు ఈ జన్యువు మందకొడిగా ఉండడమే కారణమని విశ్లేషించారు. నిజంగా ఇది ఆస్తమా రోగులకు ఊరటనిచ్చే విషయమే.


More Telugu News