కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు ఆదేశాలు

  • వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
  • ఉన్నతాధికారులకు దిశానిర్దేశం
  • ఒమిక్రాన్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • రాష్ట్రంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్న అధికారులు
ఏపీ సీఎం జగన్ ఇవాళ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి అంశంపై స్పందించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మార్గదర్శకాలు, ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఇచ్చేలా శ్రమించాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్దేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు వ్యాక్సిన్లు మాత్రమే ఆశాజనకంగా కనిపిస్తున్నాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ, ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించేందుకు వీలుగా రాష్ట్రంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ కు తెలిపారు.

ఏపీలో ఇప్పటివరకు ఒక ఒమిక్రాన్ కేసు వెల్లడైన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.


More Telugu News