ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్‌ను కిడ్నాప్ చేసిన మావోలు

  • ములుగు జిల్లా కె.కొండాపురం వద్ద కిడ్నాప్
  • ముసుగు వ్యక్తులు రమేశ్‌ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారంటున్న స్థానికులు
  • విడిచిపెట్టాలని మావోయిస్టులకు రమేశ్ కుటుంబ సభ్యుల అభ్యర్థన
ములుగు జిల్లాకు చెందిన ఓ మాజీ సర్పంచ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. జిల్లాలోని వెంకటాపురం (కె) మండలం నూరువీరుడుకు చెందిన కురుసం రమేశ్ 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రిలో ఏఎన్ఎం ఉద్యోగం రావడంతో అక్కడి ఐటీడీఏ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేశ్‌ను కె.కొండాపురం వద్ద మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో పని ఉందని చెప్పి సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రమేశ్ 24 గంటలు దాటినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆరా తీశారు. దీంతో ఆయన కిడ్నాప్‌కు గురైనట్టు తెలిసింది. కొందరు ముసుగు వ్యక్తులు రమేశ్‌ను బలవంతంగా వాహనం ఎక్కించి తీసుకెళ్లినట్టు కె.కొండాపురం గ్రామస్థులు కొందరు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. తన భర్తకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని, క్షేమంగా విడిచిపెట్టాలని మావోయిస్టులను రజిత అభ్యర్థించారు. మరోవైపు, విషయం తెలిసిన పోలీసులు కూడా రమేశ్ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News