అధికారులు, అశోక్ గ‌జ‌ప‌తి రాజు మ‌ధ్య తోపులాట‌.. వీడియో ఇదిగో

  • రామతీర్థం బోడికొండపై రామాలయ నిర్మాణ శంకుస్థాప‌న
  • ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి త‌న‌తో చ‌ర్చించ‌లేద‌న్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు
  • స‌ర్కారు త‌ర‌ఫున శంకుస్థాప‌న ఫ‌లకాలే ఏర్పాటు చేశార‌ని వ్యాఖ్య‌
  • ఈ త‌మాషా ఎందుకు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం
ఏపీ ప్ర‌భుత్వ అధికారులు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు మ‌ధ్య తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్త‌త నెల‌కొంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై నేడు కోదండ రామాలయ నిర్మాణ శంకుస్థాప‌న జ‌రుగుతోన్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. శంకుస్థాపన అంశంపై ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌న‌యిన త‌న‌తో చ‌ర్చించలేదంటూ అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఆక్షేపించారు.

ఆల‌య అధికారులు వైసీపీ స‌ర్కారు త‌ర‌ఫున శంకుస్థాప‌న ఫ‌లకాల‌ను ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాటిని అశోక్ గ‌జ‌ప‌తి రాజు తోసివేసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే అధికారులకు, ఆయ‌న‌కు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అధికారులు త‌న‌ను వెన‌క్కు తోసేస్తున్నార‌ని అశోక్ గజపతి చెప్పారు.

ఈ త‌మాషా ఎందుకు చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం కాద‌ని, ఒకవేళ స‌ర్కారు కార్య‌క్ర‌మ‌మైతే తాను ఇక్క‌డ ఉండేవాడిని కాద‌ని చెప్పారు. గ‌తంలోనూ త‌న ప‌ట్ల ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు. ఆల‌య మ‌ర్యాద‌ల‌ను ఎందుకు పాటించ‌డం లేదంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. అధికారులు, పోలీసులు ఆయ‌న‌ను స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నించినా ఆయ‌న వినిపించుకోలేదు.

ఆల‌య ప్రాంగ‌ణంలో త‌మాషాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆల‌యం వ‌ద్ద కూడా రాజ‌కీయాలు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రులు పుష్ప శ్రీ‌వాణి, వెల్లంప‌ల్లి పాల్గొన్నారు. గ‌త ఏడాది డిసెంబర్ లో అక్క‌డి కోదండ రామస్వామివారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, విగ్రహ శిరస్సును తొలగించి, తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో ఆ ఆల‌య నిర్మాణ శంకుస్థాప‌న జ‌రుపుతున్నారు.

             



More Telugu News