మొత్తానికి కేంద్రం నా సలహాను పాటించింది: బూస్టర్ డోసులపై రాహుల్ గాంధీ

  • సరైన నిర్ణయం తీసుకుందన్న కాంగ్రెస్ నేత
  • టీకాలు, బూస్టర్లు ప్రతి ఒక్కరికీ అందాలని కామెంట్
  • జనవరి 10 నుంచి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి, ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోసులు
కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులను వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మొత్తానికి తానిచ్చిన సలహాను పాటించిందంటూ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన ట్వీట్ చేశారు. ‘‘బూస్టర్ డోసులు వేయాలన్న నా సలహాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అది సరైన నిర్ణయం. వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు ‘చాలా మందికి ఇంకా వ్యాక్సిన్లే వేయలేదు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసులు ఇంకెప్పుడు వేస్తుంది?’ అని పేర్కొంటూ ఈ నెల 22న చేసిన ట్వీట్ నూ జత చేశారు.

కాగా, జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వారికీ వ్యాక్సిన్లు వేయడంతో పాటు అదే నెల 10 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లు, వృద్ధులకు బూస్టర్ డోసులు (ప్రికాషనరీ డోసు) వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు పిల్లలకు వేసే కరోనా టీకా కొవాగ్జిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి కూడా వచ్చింది.


More Telugu News