'ఔరా బుమ్రా.. బంతులేయడంలో నువ్వు ఆర్టిస్ట్' అంటూ టీమిండియా పేసర్ పై ప్రశంసల జల్లు

  • నిన్న తీసిన రెండు వికెట్లపై అభిమానులు ఖుషీ ఖుషీ
  • బంతులేయడంలో ఆర్టిస్ట్ అంటూ పొగడ్తలు
  • వాండర్ డ్యూసెన్, మహారాజలను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా
జస్ ప్రీత్ బుమ్రా.. యార్కర్ కింగ్ వేసే కొన్ని బంతులకు సమాధానమే ఉండదు. అంత పర్ ఫెక్ట్ గా, కేలిక్యులేటెడ్ గా బంతులేస్తుంటాడు. నిన్నటి దక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ లో కూల్చిన రెండు వికెట్లు ఆ కోవలోకే వస్తాయి. మ్యాచ్ లో ఉండాలంటే తప్పక క్రీజులో ఉండి తీరాల్సిన సమయంలో దక్షిణాఫ్రికా బాగానే పోరాడింది. కానీ, రోజు చివర్లో వాండర్ డ్యూసెన్, మహారాజలను క్లీన్ బౌల్డ్ చేసి ఔరా అనిపించేశాడు బుమ్రా. అందరినోటా ప్రశంసలందుకున్నాడు.

36వ ఓవర్ నాలుగో బంతికి వాండర్ డ్యూసెన్ ను చక్కటి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. అక్కడెక్కడో దూరంగా ఫిఫ్త్ స్టంప్ పై పడిన బాల్.. గిర్రున తిరిగి వికెట్ల మీదకొచ్చేసింది. ఆఫ్ స్టంప్ బెయిల్ ను గిరాటేసింది. అంతే.. షాక్ అయిపోవడం డ్యూసెన్ వంతైంది.

నైట్ వాచ్ మన్ గా వచ్చిన కేశవ్ మహారాజ్ కు దానికి పూర్తి భిన్నమైన బంతిని సంధించాడు. దాదాపు పర్ ఫెక్ట్ యార్కర్ ను సంధించాడు. ఆ బంతి కాస్తా లెగ్ స్టంప్ ను ముద్దాడుతూ వెళ్లిపోయింది. నాలుగో వికెట్ రూపంలో మహారాజ్ బ్యాట్ ముడిచి పెవిలియన్ కు వెళ్లిపోయాడు. దాంతో నాలుగో రోజు ఆటకు తెరపడింది. భారత్ కు నాలుగు వికెట్లు దక్కాయి.

బుమ్రా పెర్ ఫార్మెన్స్ పై అభిమానులు ఖుషీ ఖుషీ అయిపోతున్నారు. ఏంటా బంతులంటూ పొగిడేస్తున్నారు. బంతులేయడంలో గొప్ప ఆర్టిస్ట్ అంటూ కొనియాడుతున్నారు. టీ20 గేమ్ టెస్ట్ ప్లేయర్లను మరుగున పడేస్తోందంటూ విమర్శిస్తున్నారని, కానీ, టీ20 నైపుణ్యాలు టెస్ట్ గేమ్ ను ఎలా మెరుగుపరుస్తాయో బుమ్రా ప్రదర్శనే ఉదాహరణ అంటూ ఓ క్రికెట్ రచయిత టిమ్ విగ్మోరే కొనియాడాడు. బుమ్రా బంతికి మహారాజ్ దగ్గర సమాధానమే లేకపోయిందంటూ హర్ష భోగ్లే అన్నాడు.

బుమ్రా వేసిన ఆ రెండు బంతులు సూపర్ అంటూ ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. ఒక బంతి ఆఫ్ స్టంప్ బెయిల్ ను గిరాటేస్తే.. మరో బంతి లెగ్ సైడ్ వికెట్ ను ముద్దాడేసింది.. అంత పర్ ఫెక్ట్ బంతులంటూ మరో అభిమాని ప్రశంసించాడు.



More Telugu News