సంచ‌ల‌నం సృష్టిస్తోన్న 'పుష్ప‌'.. త‌గ్గేదేలే అంటూ రికార్డుల హోరు

  • హిందీలో వీకెండ్‌లో ఏ సినిమాకీ రాన‌న్ని వ‌సూళ్లు
  • నిన్న ఏకంగా 6.10 కోట్ల రూపాయ‌లు క‌లెక్ష‌న్లు
  • మొన్న రూ.3.50 కోట్లు
  • త్వ‌ర‌లోనే రూ.75 కోట్ల క్ల‌బ్‌లోకి వెళ్ల‌నున్న పుష్ప‌
గ‌త‌ నెల 17న‌ విడుద‌లైన 'పుష్ప' సినిమా ఇప్ప‌టికే బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతూనే ఉంది. క‌రోనా ఆంక్ష‌లు ఉన్న‌ప్ప‌టికీ ఈ సినిమా హిందీలోనూ సెన్సేష‌న‌ల్‌గా నిలుస్తోందని తెలుపుతూ 'పుష్ప' వ‌సూళ్ల వివ‌రాల‌ను సినీ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వెల్ల‌డించారు. 16వ రోజున కూడా హిందీలో ఏ సినిమాకూ రాన‌న్ని క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింద‌ని వివ‌రించారు.

ప‌వ‌ర్ ఫుల్ కంటెంట్‌తో వ‌చ్చిన ఈ సినిమా శుక్ర‌వారం రూ.3.50 కోట్లు, శ‌నివారం ఏకంగా 6.10 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టింద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ చెప్పారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా సాధించిన క‌లెక్ష‌న్లు రూ.56.69 కోట్ల‌కు చేరింద‌ని పేర్కొన్నారు. హిందీలో త్వ‌ర‌లోనే రూ.75 కోట్ల క్ల‌బ్‌లోకి వెళ్లే దిశ‌గా 'పుష్ప' దూసుకుపోతోంద‌ని చెప్పారు.

                        
ఈ సినిమా విడుద‌లై ప‌ది రోజులు దాటినా ద‌క్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన 'పుష్ప' సినిమా ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ క‌థాంశంతో వ‌చ్చింది. హిందీ సినిమా '83'తో పాటు ప‌లు సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ 'పుష్ప' సినిమాయే క‌లెక్ష‌న్ల‌లో ముందు వ‌రుస‌లో నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

ఆలిండియా రికార్డు స్థాయిలో ఈ సినిమా వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా రూ.300 కోట్ల గ్రాస్‌ను దాటేసిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా క‌లెక్ష‌న్ల జోరు సంక్రాంతికి కూడా కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేస్తూ ఆ సినిమా బృందం నిర్ణ‌యం తీసుకుంది.

దీంతో 'అఖండ' మిన‌హా పెద్ద సినిమాలు ఏవీ అందుబాటులో లేవు. దీంతో 'పుష్ప' సినిమా రికార్డుల మోత మ‌రింత కొన‌సాగుతుంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. క‌రోనా వేళ కూడా 'పుష్ప' రికార్డులు బ‌ద్ద‌లు కొడుతూ ప్రేక్ష‌కుల‌ను సినిమా థియేట‌ర్ల వైపున‌కు మ‌ళ్లేలా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.



More Telugu News