సంక్రాంతి బరిలో 'శేఖర్' సందడి!

  • రాజశేఖర్ హీరోగా 'శేఖర్' చిత్రం
  • జీవిత దర్శకత్వంలో సినిమా
  • సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు
  • ఇప్పటికే వాయిదా పడిన 'ఆర్ఆర్ఆర్'
  • 'రాధేశ్యామ్' విడుదల ఖాయమంటున్న చిత్రయూనిట్
  • అయినప్పటికీ తొలగని అనిశ్చితి
సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా 'శేఖర్'. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. ఆమె స్క్రీన్ ప్లే కూడా  సమకూర్చారు. ఈ చిత్ర నిర్మాణంలో రాజశేఖర్ కుమార్తెలు కూడా భాగస్వాములు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు.

కాగా 'శేఖర్' మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. కొన్నిరోజుల కిందట పరిస్థితి చూస్తే... సంక్రాంతికి పెద్ద సినిమాల జాతర ఖాయమని అనిపించింది. అందుకు తగ్గట్టుగానే 'ఆర్ఆర్ఆర్' చిత్ర యూనిట్ ప్రమోషన్లతో హోరెత్తించింది. జనవరి 7న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, పలు భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లతో అభిమానులకు ఉత్సాహం కలిగించింది. అయితే కరోనా దెబ్బకు పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేస్తుండడంతో 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదాపడింది.

ఇక ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం విషయానికొస్తే... ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని చిత్రబృందం ఖండించింది కూడా. 'రాధేశ్యామ్' కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదలకు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకైతే జనవరి 14న 'రాధేశ్యామ్' విడుదల ఖాయయమని చిత్రబృందం ఢంకా బజాయిస్తోంది. అయినప్పటికీ 'రాధేశ్యామ్' భారీ చిత్రం కావడంతో విడుదలపై అనిశ్చితి పూర్తిగా తొలగిపోలేదు. కరోనా కేసులు పెరుగుతుండడంతో అనేక రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఈ పరిణామం పెద్ద హీరోల చిత్రాలకు నిజంగా సంకటమే.

ఈ నేపథ్యంలో, రాజశేఖర్ హీరోగా వస్తున్న 'శేఖర్' సంక్రాంతి బరిలో విడుదల కానుందని తెలుస్తోంది. రానున్న రెండు వారాల్లో పెద్ద హీరోల చిత్రాలేవీ లేకపోతే, 'శేఖర్' కు థియేటర్లు కూడా పెద్ద సంఖ్యలో లభించే అవకాశాలున్నాయి. త్వరలోనే 'శేఖర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.

కాగా ఈ సినిమాలో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది. ఈ చిత్రంలో ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిశోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్  సంగీతం అందిస్తున్నారు.


More Telugu News