'మేజర్' నుంచి ఫస్టు సింగిల్ రెడీ!

  • 'మేజర్' గా అడివి శేష్
  • కథానాయికగా సయీ మంజ్రేకర్
  • ఈ నెల 7వ తేదీన ఫస్టు సింగిల్
  • ఫిబ్రవరి 11వ తేదీన సినిమా రిలీజ్  
మొదటి నుంచి కూడా అడివి శేష్ వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. 'క్షణం' .. 'గూఢచారి' .. 'ఎవరు' వంటి సినిమాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. ఈ క్రమంలో తెలుగు .. తమిళ భాషల్లో ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మేజర్' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ గా ఫిబ్రవరి 11వ తేదీని ఫిక్స్ చేశారు.

ముంబై తాజ్ హోటల్ పై కొన్నేళ్ల క్రితం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ ఆపరేషన్ లో కీలకమైన పాత్రను పోషించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను అడివి శేష్ పోషించాడు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకమైన కసరత్తు చేయడం విశేషం. ఈ సినిమాతో కథానాయికగా సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి పరిచయమవుతోంది.

శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన 'హృదయమా' అనే పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా, ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు ఈ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను హీరో మహేశ్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే..


More Telugu News