హబుల్ టెలిస్కోప్ అపురూప ఘనత.. అంతరిక్షంలో 100 కోట్ల సెకన్లు పూర్తి

  • 25 ఏప్రిల్ 1990లో అంతరిక్షంలోకి ‘హబుల్’
  • నిన్నటితో 100 కోట్ల సెకన్ల సేవలు పూర్తి
  • మరమ్మతుల కోసం ఇప్పటి వరకు ఐదుసార్లు వెళ్లిన వ్యోమగాములు
  • మొత్తం 1000 కోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చు
అంతరిక్షంలో గత 30 సంవత్సరాలుగా చక్కర్లు కొడుతున్న అతిపెద్ద టెలిస్కోప్ ‘హబుల్’  అరుదైన ఘనత సాధించింది. ఇప్పటి వరకు 100 కోట్ల సెకన్ల సేవలు అందించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 25 ఏప్రిల్ 1990లో దీనిని ప్రయోగించింది. ఇందుకోసం ఏకంగా 470 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది. నిన్నటితో ఇది 100 కోట్ల సెకన్లు పూర్తి చేసుకుని అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఈ 30 ఏళ్లలో అంతరిక్షానికి సంబంధించి ఎన్నో రహస్యాలను శాస్త్రవేత్తలకు అందించింది. అత్యంత అరుదైన ఫొటోలను పంపి బోలెడన్ని చిక్కుముడులు విప్పేందుకు సహకరించింది.

నిజానికి ఈ టెలిస్కోప్‌ను 1988లోనే అంతరిక్షంలోకి పంపాలని అనుకున్నారు. అయితే, సాంకేతిక కారణాల కారణంగా రెండేళ్లు ఆలస్యమైంది. 1990లో దీనిని అంతరిక్షంలోకి పంపి కక్ష్యలో ప్రవేశపెట్టినప్పటికీ ఫొటోలు స్పష్టంగా పంపడంలో విఫలమైంది. ఫొటోలు అస్పష్టంగా రావడంతో మరమ్మతు కోసం అంతకుముందు ఖర్చు చేసిన సొమ్ముకు రెట్టింపు వెచ్చించాల్సి వచ్చింది. టెలిస్కోపులో అమర్చిన 2.4 మీటర్ల దర్పణాన్ని పాలిష్ చేయాల్సి వచ్చింది. దీంతో డిసెంబరు 1993లో ఏడుగురు వ్యోమగాములను ఎండీవర్ షటిల్ ద్వారా అంతరిక్షానికి పంపింది.

మరమ్మతుల అనంతరం 13 జనవరి 1994లో పూర్తి స్పష్టతతో కూడిన ఫొటోలు పంపింది. హబుల్ టెలిస్కోప్‌కు మరమ్మతుల కోసం 2009 వరకు మొత్తంగా ఐదు సార్లు వ్యోమగాములను పంపాల్సి వచ్చింది. ఫలితంగా దీని ప్రయోగం ఖర్చు 1000 కోట్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఇదిలావుంచితే, అత్యంత శక్తిమంతమైన జేమ్స్‌వెబ్ టెలిస్కోప్‌ను ఇటీవలే అంతరిక్షంలోకి ప్రయోగించారు. అయినప్పటికీ హబుల్ మాత్రం తన సేవలను కొనసాగిస్తూనే ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


More Telugu News