కరోనా ఎఫెక్ట్: స్కూళ్లకు సెలవులు పొడిగింపు

  • జనవరి 30దాకా పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
  • వైద్య శాఖ సిఫార్సుకు సీఎస్ ఆమోదం
  • ఇవాళ్టితో ముగిసిన సంక్రాంతి సెలవులు
కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులను పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 8 నుంచి ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఇవాళ్టితో సెలవులు ముగిశాయి. ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా కేసుల పెరుగుదలతో స్కూళ్లకు మరికొన్నాళ్లపాటు సెలవులివ్వాలన్న వైద్యారోగ్య శాఖ సిఫార్సులకు అనుగుణంగా సర్కారు సెలవులను ప్రకటించింది. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇవాళ ఉత్తర్వులను జారీ చేశారు.

వాస్తవానికి ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని పేర్కొంటూ జనవరి 9న ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, స్కూళ్లకూ సెలవులను అప్పటిదాకా పొడిగిస్తారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. 20 వరకు పొడిగించాలని భావించారు కూడా. తాజాగా 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


More Telugu News