కోవిడ్ మరణాలు రికార్డుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.. పరిహారం కోరుతూ దరఖాస్తుల వెల్లువ!

  • గుజరాత్ లో 9 రెట్లు అధికంగా దరఖాస్తులు
  • తెలంగాణలో 7 రెట్లు అధికంగా బాధితులు
  • మెజారిటీ రాష్ట్రాల్లో ఇదే తీరు
  • ఆసుపత్రుల బయటే ఎక్కువ మరణాలు
కరోనాతో మరణించినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న గణాంకాల కంటే.. నిజంగా ఈ వైరస్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు లోగడ ఆదేశించింది. ఈ అంశంలో అత్యున్నత న్యాయస్థానం తన పర్యవేక్షణను కొనసాగిస్తోంది.

సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఫైల్ చేసిన వివరాలను పరిశీలిస్తే.. తెలంగాణలో 4,100కు పైగా మరణించినట్టు రాష్ట్ర సర్కారు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, కరోనా పరిహారం కోసం 29,969 దరఖాస్తులు (సుమారు 7 రెట్లు) వచ్చాయి. ఇప్పటికే 12వేలకు పైగా కేసుల్లో పరిహారం చెల్లించడం పూర్తయింది.

ఆంధ్రప్రదేశ్ లో మృతుల సంఖ్య 15 వేల స్థాయిలో ఉంటే పరిహారం కోసం 36 వేలకు పైనే దరఖాస్తులు వచ్చాయి. 11,464 దరఖాస్తుదారులకు పరిహారం మంజూరైంది. ఇక గుజరాత్ లో అధికారిక కరోనా మృతులు 10 వేలు ఉంటే పరిహారం కోసం 90 వేల దరఖాస్తులు (9 రెట్లు) వచ్చాయి. దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో మృతుల సంఖ్యకు మించి పరిహారానికి దరఖాస్తులు వచ్చాయి.

కరోనాతో ఆసుపత్రుల్లో మరణించిన వారి పేర్లే రికార్డులకు ఎక్కాయి. ఆసుపత్రి బయట కరోనాతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోగా, వారి వివరాలు గణాంకాల్లోకి చేరలేదని.. ఇప్పుడు దరఖాస్తులు ఎక్కువగా రావడానికి ఇదే కారణమని తెలుస్తోంది. కరోనా పాజిటివ్ గా తేలిన తర్వాత నెల రోజుల్లోపు మరణించిన అందరికీ పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. దీంతో కరోనా పాజిటివ్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారికి సంబంధించి కూడా పరిహారం ఇవ్వాల్సి వస్తుంది.

మరోవైపు ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అధికారిక మృతుల సంఖ్యతో పోలిస్తే పరిహారానికి వచ్చిన దరఖాస్తులు తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడమేనని తెలుస్తోంది.


More Telugu News