టీ20 ప్రపంచకప్ 2022 షెడ్యూలు వచ్చేసింది.. భారత్ తొలి పోరు పాకిస్థాన్‌తోనే!

  • ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ 
  • మొత్తం ఏడు వేదికల్లో 45 మ్యాచులు
  • అక్టోబరు 23న భారత్-పాక్ పోరు
  • శ్రీలంక-నమీబియా మ్యాచ్‌తో పోటీలు మొదలు
  • నవంబరు 13న ఫైనల్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2022 షెడ్యూలు కాసేపటి క్రితం విడుదలైంది. ఆస్ట్రేలియాలో అక్టోబరు 16-నవంబరు 13 మధ్య పోటీలు జరగనున్నాయి. మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, అడిలైడ్, గీలాంగ్, హోబర్డ్, పెర్త్ స్టేడియాలు ఇందుకు వేదిక కానున్నాయి. అక్టోబరు 23న భారత జట్టు తన తొలి పోరులో పాకిస్థాన్‌తో తలపడనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) ఇందుకు వేదిక కానుంది.

ఇక ఈ పోటీలలో మొత్తం 45 మ్యాచులు జరగనున్నాయి. 2014 చాంపియన్స్ శ్రీలంక-నమీబియా మధ్య పోరుతో తొలి రౌండ్ పోటీలు ప్రారంభమవుతాయి. అక్టోబరు 16న గీలాంగ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. రెండుసార్లు చాంపియన్ అయిన వెస్టిండీస్ కూడా తొలి రౌండ్‌లో స్కాట్లాండ్‌తో తలపడనుంది. సూపర్-12 గ్రూప్-1లో ఆతిథ్య ఆస్ట్రేలియా, ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్-ఎ విజేత, గ్రూప్-బి రన్నరప్ ఉంటాయి.

గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తోపాటు గ్రూప్ బి విజేత,  గ్రూప్-ఎ రన్నరప్ జట్లు ఉంటాయి. నవంబరు 9న తొలి సెమీస్, ఆ తర్వాతి రోజు రెండో సెమీస్ జరగనుండగా, అదే నెల 13న మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరుగుతుంది.


More Telugu News