తమిళనాడులో మతం మారాలని వార్డెన్ ఒత్తిడి.. తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య!

  • తంజావూరు జిల్లాలోని తిరుకాట్టుపల్లిలో ఘటన
  • హాస్టల్‌లో ఉంటూ ప్లస్-2 చదువుతున్న విద్యార్థిని
  • మరుగుదొడ్లు, హాస్టల్ గదులు క్లీన్ చేయాలని వార్డెన్ వేధింపులు
  • పురుగుల మందు తాగి ఆత్మహత్య 
  • నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు
మతం మారాలంటూ హాస్టల్ వార్డెన్ నుంచి వస్తున్న వేధింపులను తట్టుకోలేని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. తన ఆత్మహత్యకు కారణం వివరిస్తున్న బాధిత బాలిక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిల్లాలోని తిరుకాట్టుపల్లిలో మైఖేల్‌పట్టి సేక్రెడ్ హార్ట్ మహోన్నత పాఠశాల ఉంది. హాస్టల్‌లో ఉంటూ ప్లస్-2 చదువుతున్న విద్యార్థిని (17)ని హాస్టల్ మరుగుదొడ్లు, గదులు శుభ్రం చేయాలని వార్డెన్ సహాయమేరీ (62) నిత్యం వేధించేది.

ఆమె వేధింపులు భరించలేని బాధిత విద్యార్థిని ఈ నెల 15న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను తంజావూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 19న మృతి చెందింది. మతం మారాలంటూ తన కుమార్తెపై వార్డెన్ ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆత్మహత్య చేసుకుందని, ఇందుకు సంబంధించి వీడియో ఆధారం కూడా ఉందని ఆమె తండ్రి మురుగానందం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో కదిలిన పోలీసులు మేరీని అరెస్ట్ చేశారు.

ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ విద్యార్థిని తండ్రి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. వీడియోను పరిశీలించి అందులోని గొంతు విద్యార్థినిదో, కాదో నిర్ధారించాలని పోలీసు శాఖను ధర్మాసనం ఆదేశించింది. ఈ నెల 27వ తేదీలోగా సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే, ఆ వీడియోను రికార్డు చేసిన వ్యక్తిని దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. రికార్డు చేసిన సెల్‌ఫోన్‌ వెంట తీసుకెళ్లాలని పేర్కొంది. కాగా, ఈ వ్యవహారం తమిళనాడులో రాజకీయ రచ్చకు కారణమైంది. లావణ్య వ్యవహారంలో న్యాయం చేయాలంటూ నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది.


More Telugu News