పిల్లలపై కరోనా ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు.. వైద్యుల హెచ్చరిక

  • కోల్ కతాలోని కొందరు పిల్లల్లో తీవ్ర లక్షణాలు
  • ఏఈఎస్, కరోనా పాజిటివ్ తో ఐసీయూల్లో చేరిక
  • చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
కరోనా మహమ్మారి చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపించడం లేదన్నది ఇప్పటి వరకు ఎక్కువ మందిలో ఉన్న భావన. కానీ, వైరస్ లోడ్ రిస్క్ అందరిలోనూ ఒకే తీరున ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. చిన్నారులైనా, పెద్దవారైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకుని వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవడమే శ్రీరామరక్షగా భావించాలి. ఇందుకు నిదర్శనమే కోల్ కతాలో వెలుగు చూస్తున్న కేసులు.

గడిచిన రెండు వారాల్లో కరోనా తీవ్ర లక్షణాలతో కోల్ కతాలోని ఆసుపత్రులలో చేరే చిన్నారుల సంఖ్య పెరిగింది. అక్యూట్ ఎన్ సెఫలైటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్) లక్షణాలతో పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ (పీఐసీయూ) లో చిన్నారులు చేరుతున్నారు. వీరు పెద్దలతో పోలిస్తే కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఏఈఎస్ లో తీవ్ర న్యూమోనియాతోపాటు మెదడుకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది.

మొదటి రెండు విడతల్లో పిల్లలపై వైరస్ ప్రభావం పెద్దగా లేకపోయినా, హాని చేయని వైరస్ గా దీన్ని భావించొద్దని వైద్యులు సూచిస్తున్నారు. కోల్ కతాలో చిన్నారుల రిఫరల్ హాస్పిటల్ అయిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ లో.. కరోనా పాజిటివ్, ఏఈఎస్ లక్షణాలతో ఎనిమిది మంది పిల్లలు (8-14 వయసు) పీఐసీయూలో చేరారు. ఒక బాలుడు మరణించాడు.


More Telugu News