ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఆష్లే బార్టీ

  • ఫైనల్లో డానియెల్లె కొలిన్స్ పై విజయం
  • వరుస సెట్లలో నెగ్గిన బార్టీ
  • సొంతగడ్డపై అద్భుత ప్రదర్శన
  • ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ గా ఉన్న ఆసీస్ క్రీడాకారిణి
ఆస్ట్రేలియా టెన్నిస్ కెరటం ఆష్లే బార్టీ సొంతగడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. మెల్బోర్న్ లో ఇవాళ జరిగిన ఫైనల్లో ఆష్లే బార్టీ 6-3, 7-6 (7-2)తో వరుస సెట్లలో అమెరికా క్రీడాకారిణి డానియెల్లె కొలిన్స్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఆమెకు రూ.15 కోట్ల మేర ప్రైజ్ మనీ దక్కింది. కెరీర్ లో ఆమెకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్.

టైటిల్ పోరులో ఫేవరెట్ గా బరిలో దిగిన బార్టీ అంచనాలకు తగ్గట్టుగానే 6-3తో తొలి సెట్ ను అలవోకగా చేజిక్కించుకుంది. అయితే రెండో సెట్ లో ప్రత్యర్థి కొలిన్స్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఓ దశలో కొలిన్స్ రెండో సెట్ లో 3-0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ, సొంత ప్రేక్షకులు అందిస్తున్న ప్రోత్సాహంతో బార్టీ తిరిగి ఊపందుకుంది. పలుమార్లు కొలిన్స్ సర్వీసును బ్రేక్ చేసి ఆ సెట్ ను టైబ్రేకర్ దిశగా మళ్లించింది. టైబ్రేకర్ లో ఆసీస్ క్రీడాకారిణికి ఎదురులేకుండాపోయింది. కొలిన్స్ పై 7-2తో టైబ్రేకర్ లో నెగ్గి మహిళల సింగిల్స్ విజేతగా అవతరించింది.

25 ఏళ్ల ఆష్లే బార్టీకి ఇదే తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. గతంలో ఆమె ఫ్రెంచ్ ఓపెన్ (2019), వింబుల్డన్ (2021) టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. యూఎస్ ఓపెన్ లో మాత్రం రెండు పర్యాయాలు నాలుగో రౌండ్ వరకు వచ్చింది. బార్టీ ప్రస్తుతం అంతర్జాతీయ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.

కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ సమరం రేపు రాఫెల్ నాదల్, డానిల్ మెద్వెదెవ్ ల మధ్య జరగనుంది.


More Telugu News