ఐపీఎల్ ఆటగాళ్లకు చెల్లింపుల విధానం ఎలా పనిచేస్తుంది?

  • వేలంలో పలికిన ధరే చెల్లించాల్సి ఉంటుంది
  • సీజన్ కు అందుబాటులో ఉంటే చాలు
  • ఒక్క మ్యాచ్ ఆడకపోయినా పూర్తి మొత్తం
  • కొన్ని మ్యాచులకే అందుబాటులో ఉంటే పాక్షిక చెల్లింపులు
ఐపీఎల్ వేలం పాటలో ఒక్కో క్రికెటర్ ఒక్కో రేటుకు అమ్ముడుపోవడం చూసే ఉంటారు. మరి వీరికి చెల్లింపులు ఎలా చేస్తారు? ఇది ఎక్కువ మందికి తెలియని విషయం. వేలంలో ఎంత రేటు ఖరారైందో ఆ మొత్తాన్నే ఒక క్రీడాకారునికి ఆయా ఫ్రాంచైజీలు చెల్లించాల్సి ఉంటుంది.

దీన్నే పారితోషికం, లేదా వేతనం అని అనుకోవచ్చు. ఇది తప్ప ఇతర చెల్లింపులు ఉండవు. ఉదాహరణకు ఒక ఆటగాడు రూ.10 కోట్లకు అమ్ముడుపోయాడనుకుంటే.. ఒక సీజన్ కోసం ఈ మొత్తాన్ని చెల్లించాలి. మూడేళ్ల కాంట్రాక్టుపై ఆటగాడిని కొనుగోలు చేసి, ఆ తర్వాత కూడా కొనసాగిస్తే అంతే మొత్తాన్ని తర్వాతి సీజన్ కు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఒక సీజన్ కు ఆటగాడు పూర్తిగా అందుబాటులో ఉంటే పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. ఎన్ని మ్యాచుల్లో ఆడాడన్న దానితో సంబంధం లేదు. అతడితో ఎన్ని మ్యాచులు ఆడించాలన్నది ఫ్రాంచైజీ ఇష్టం. ఒకవేళ ఆటగాడి వైపు ఏవైనా కారణాలతో కొన్ని మ్యాచులకే అందుబాటులో ఉన్నట్టయితే నిబంధనల మేరకు చెల్లింపులు చేస్తారు.

కాంట్రాక్టు గడువు తీరక ముందే ఆటగాడిని ఫ్రాంచైజీలు విడిచిపెడితే.. ఒప్పందం కాల వ్యవధి వరకు అతడికి పూర్తి చెల్లింపులు చేసి పంపించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆటగాడే స్వయంగా తనను విడుదల చేయాలని కోరితే ఫ్రాంచైజీలు అప్పటి వరకే చెల్లింపులు చేస్తాయి.

మ్యాచుల సందర్భంగా ఆటగాళ్లు గాయపడితే, చికిత్సకు అయ్యే పూర్తి వ్యయాన్ని ఫ్రాంచైజీలు భరించాల్సి ఉంటుంది. ఇక వేతనం మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లిస్తుంటాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు 50 శాతం, సీజన్ చివరిలో మిగిలిన 50 శాతాన్ని చెల్లిస్తుంటాయి. కొన్ని అయితే సీజన్ ఆరంభానికి వారం ముందు 15 శాతం, సీజన్ మధ్యలో 65 శాతం, సీజన్ ముగిసిన తర్వాత 20 శాతం చొప్పున చెల్లిస్తాయి.


More Telugu News