రామ్ చ‌ర‌ణ్ కొత్త సినిమా పైర‌సీ లింకులు క‌న‌ప‌డితే మాకు పంపండి: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్

  • ఆర్సీ15-ఎస్వీసీ 50 సినిమా షూటింగ్ జ‌రుగుతోంది
  • అవసరాలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్
  • వీడియోలు, ఫోటోలు తీయ‌కూడ‌దు
  • మా యాంటీ వైరస్ టీమ్ చర్య‌లు తీసుకుంటుందన్న సినీ నిర్మాణ సంస్థ‌
సినిమా షూటింగ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలోనే ఫొటోలు, వీడియోలు తీసి కొంద‌రు సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు చేస్తుండడం సినీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. సినీ యూనిట్‌కు చెందిన వారు కూడా ఈ లీకుల‌కు పాల్ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ఇటువంటి ఘ‌ట‌న‌లు చాలా చోటు చేసుకున్నాయి.

తాజాగా మ‌హేశ్ బాబు 'కళావతి' సాంగ్ కూడా అధికారికంగా విడుద‌ల చేయ‌కముందే సామాజిక మాధ్య‌మాల్లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో నిర్మాత‌లు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమా శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. దీనిపై వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స్పందిస్తూ... ఆర్సీ15-ఎస్వీసీ 50 సినిమా షూటింగ్‌ అవసరాలకు అనుగుణంగా బహిరంగా ప్రదేశాల్లో చాలా మందితో జ‌రుగుతోందని తెలిపింది. ఆ స‌మ‌యంలో చట్ట విరుద్ధంగా వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయకూడదని కోరుతున్నామని పేర్కొంది.

అనధికారికంగా కంటెంట్ ను పోస్ట్ చేసే వారి ఐడీలపై మా యాంటీ వైరస్ టీమ్ దృష్టి పెట్టి చర్య‌లు తీసుకుంటుందని హెచ్చ‌రించింది. మా టీమ్‌కు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌తి ఒక్క‌రినీ కోరుతున్నామ‌ని, ఏవైనా పైర‌సీ లింకుల‌ను గుర్తిస్తే report@blockxtech.comకు పంపాల‌ని కోరింది.

 కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ న‌టిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్‌ రాజు, శిరీశ్ నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ స‌మ‌యంలో ఎవ‌రూ సెల్‌ఫోన్లు వాడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  

కాగా, రామ్ చ‌ర‌ణ్ షూటింగ్ లో పాల్గొన‌డానికి నిన్న ఓ ప్రాంతానికి వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న‌ను చూసేందుకు భారీగా జ‌నం త‌ర‌లివ‌చ్చారు. వారికి చెర్రీ అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.


More Telugu News