చైనాలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా దురాగతం.. మహిళను గొలుసులతో బంధించి అరాచకం!

  • 1998 లో కిడ్నాప్‌కు గురైన మహిళ
  • అనంతరం పలుమార్లు విక్రయం
  • 1999 నుంచి 2020 మధ్య ఏడుగురు పిల్లల్ని కన్న వైనం
  • విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
  • 17 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు
చైనాలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా దురాగతం.. మహిళను గొలుసులతో బంధించి అరాచకం!
చైనాలో మానవ అక్రమ రవాణా ముఠాల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఓ మహిళను గొలుసులతో బంధించి ఓ గుడిసెలో నిర్బంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఇప్పుడీ వీడియోపై చైనాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మహిళలను కిడ్నాప్ చేస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు వారిని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నాయి. ఈ వీడియో వెలుగులోకి వచ్చాక విద్యావంతుల నుంచి సామాన్యుల వరకూ తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

రంగంలోకి దిగిన ఫెంగ్ కౌంటీ అధికారులు విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా 17 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అలాగే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫెంగ్ కౌంటీ కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్‌‌‌ను పదవి నుంచి తప్పించారు. తలుపు లేకుండా ఉన్న చిన్న గదిలో మెడలో గొలుసులతో బంధించిన మహిళ వీడియో గత నెలలో వైరల్ అయింది.

యునాన్‌కు చెందిన బాధిత మహిళను 1998లో మానవ అక్రమ రవాణా ముఠా సభ్యులు జియాంగ్సుకు తెచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఆమెను వధువుగా రెండుసార్లు విక్రయించారు. బాధిత మహిళకు 1995లో వివాహం కాగా రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. సాంగ్ అనే మహిళ ఆమెకు మాయమాటలు చెప్పి 2 వేల కిలోమీటర్ల దూరంలోని జియాంగ్సు ప్రావిన్సుకు తీసుకెళ్లి గోంఘాయ్ కౌంటీకి చెందిన వ్యక్తికి అమ్మేసింది.

ఆ తర్వాత వారు వధువు పేరుతో మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఫెంగ్ కౌంటీకి చెందిన ఇంకో వ్యక్తికి విక్రయించాడు. అనంతరం ఓ వ్యక్తి ఆమెను వివాహం చేసుకున్నాడు. 2000వ సంవత్సరంలో వారికి వివాహ ధ్రువీకరణ పత్రం కూడా జారీ అయింది. 1999 నుంచి 2020 మధ్య బాధిత మహిళ ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.


More Telugu News