ట్రోలింగ్‌కు భ‌య‌ప‌డేది లేదు: ఏపీ మంత్రి బొత్స‌

  • టికెట్ల విష‌యం తేలేదాకా విడుద‌ల వాయిదా వేసుకోండి
  • ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగేలాగానే ముందుకు సాగుతాం
  • సినీ ప్ర‌ముఖులు ఇప్పటికే ‌మా‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు
  • అన్ని స‌మ‌స్య‌ల‌పై క‌మిటీ వేశామన్న బొత్స 
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో ఏపీలో సినిమా టికెట్ల‌పై నెల‌కొన్న వివాదంపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. సోష‌ల్ మీడియాలో త‌మ‌పై జ‌రుగుతున్న ట్రోలింగ్‌కు ఎంత‌మాత్రం భ‌య‌ప‌డేది లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. టికెట్ ధ‌ర‌లు న‌చ్చ‌క‌పోతే..సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకోవాల‌ని కూడా ఆయ‌న ఓ స‌ల‌హా ఇచ్చారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం ఆలోచించే ప్ర‌భుత్వమ‌ని, ఈ విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా బొత్స చెప్పుకొచ్చారు.

శుక్ర‌వారం నాడు విజ‌య‌న‌గ‌రంలో అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న స‌మావేశం అనంత‌రం అక్క‌డే మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల‌, అతి త‌క్కువగా ఉన్న సినిమా టికెట్ రేట్ల కార‌ణంగా కొన్ని సినిమా థియేట‌ర్ల మూత త‌దిత‌రాల‌పై మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలిచ్చారు. సినిమా టికెట్ రేట్లు త‌క్కువ‌గా ఉన్నాయ‌నుకుంటే.. ఆ వ్య‌వ‌హారం తేలేదాకా సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకోవ‌చ్చుక‌దా? అని మంత్రి ప్రశ్నించారు.

టికెట్ రేట్లు, సినిమా ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ప‌రిశ్ర‌మ‌కు చెందిన చిరంజీవి స‌హా ప‌లువురు ప్ర‌తినిధులు ఇప్ప‌టికే త‌మ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, ఆ చ‌ర్చ‌ల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన విష‌యాల‌పై ప్ర‌భుత్వం ఓ క‌మిటీని వేసింద‌న్నారు. క‌మిటీ నివేదిక వ‌చ్చాక అన్ని విష‌యాల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని బొత్స తెలిపారు. అప్ప‌టిదాకా పాత జీవో ఆధారంగానే సినిమా టికెట్లు ఉంటాయ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇవేవీ ప‌ట్ట‌కుండా త‌మ ప్ర‌భుత్వ తీరుపై సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నార‌ని, ఈ త‌ర‌హా ట్రోలింగ్‌కు తాము భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని బొత్స తేల్చిచెప్పారు.


More Telugu News