కేంద్ర ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ మరోసారి బయటపడింది: కవిత

  • కేంద్రంపై ధ్వజమెత్తిన కల్వకుంట్ల కవిత
  • కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శలు
  • రా రైస్ మాత్రమే కొంటానంటున్నారని ఆరోపణ
  • బండి సంజయ్ కి వ్యవసాయంపై అవగాహన లేదని వ్యాఖ్యలు
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ అధికార పక్షం సాగిస్తున్న పోరు కొనసాగుతోంది. రాష్ట్ర రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ మరోసారి బయటపడిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 

యాసంగిలో తెలంగాణలో అధికశాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి తెలుసని కవిత వెల్లడించారు. అయినప్పటికీ రా రైస్ మాత్రమే కొంటామంటూ కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. రైతులు పండించే పంటను కొనకుండా, పండించని పంటను కొంటామంటూ బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. 

బండి సంజయ్ కి తెలంగాణ వ్యవసాయం గురించి ఏమాత్రం అవగాహనలేదని, యాసంగిలో రాష్ట్రంలో ఏ రకం బియ్యం ఉత్పత్తి అవుతాయో తెలుసుకోవాలని కవిత హితవు పలికారు. "మీకు తెలియకపోతే రాష్ట్రంలో ఏ రైతును అడిగినా మీకు జ్ఞానోదయం చేయిస్తారు. మీ అర్ధజ్ఞానంతో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.


More Telugu News