'జ‌గ‌న‌న్న తోడు' మూడో విడ‌త‌కు జ‌గ‌న్ శ్రీకారం

  • ఇప్ప‌టికే రెండు విడ‌త‌ల్లో 14 ల‌క్ష‌ల మందికి రుణాలు
  • మూడో విడ‌త‌లో 5,10,462 మంది చిరు వ్యాపారుల‌కు రుణాలు
  • చిరు వ్యాపారులకు ఈ ప‌థ‌కం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింద‌న్న జ‌గ‌న్‌
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల్లో ఒక‌టైన జ‌గ‌న‌న్న తోడులో మూడో విడ‌త‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారుల‌కు చేయూత‌నందించేందుకు ఉద్దేశించిన ఈ ప‌థ‌కంలో ఇప్ప‌టికే రెండు విడ‌త‌ల్లో 14 ల‌క్ష‌ల మంది చిరు వ్యాపారుల‌కు రూ.10 వేల చొప్పున వ‌డ్డీ లేని రుణాల‌ను జ‌గ‌న్ స‌ర్కారు అందించింది.

 తాజాగా మూడో విడ‌త‌లో 5,10,462 మంది చిరు వ్యాపారుల‌కు ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ సోమ‌వారం ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని ఆయ‌న‌ పేర్కొన్నారు. చిరు వ్యాపారులు వారి కాళ్ల మీద వారు నిలబడడానికి ఈ ప‌థ‌కం ఎంతగానో ఉపయోగపడుతుందని జ‌గ‌న్ పేర్కొన్నారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని చెప్పిన జ‌గ‌న్‌.. వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని తెలిపారు.


More Telugu News