యుద్ధంలో మృతుల సంఖ్య‌పై ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేసిన ఉక్రెయిన్

  • ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ అత్యవసర సమావేశం 
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 352 మంది ఉక్రెయిన్ పౌరుల మృతి
  • వారిలో 16 మంది చిన్నారులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మ‌రింత ఉద్ధృతం చేస్తోన్న నేప‌థ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ అత్యవసర సమావేశం నిర్వ‌హించింది. ఇందులో ప‌లు దేశాల ప్ర‌తినిధులు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఉక్రెయిన్ ప్ర‌తినిధి ఈ సమావేశంలో మాట్లాడుతూ... యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 352 మంది ఉక్రెయిన్ ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయార‌ని, వారిలో 16 మంది చిన్నారులు కూడా ఉన్నార‌ని చెప్పారు. 

మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంద‌ని, దాడులు కొన‌సాగుతున్నాయ‌ని వివ‌రించారు. అయితే, ఐక్య‌రాజ్య స‌మితి మాన‌వ హ‌క్కుల క‌మిష‌న‌ర్ లిజ్ త్రోసెల్ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ‌గానే ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కాగా, ర‌ష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో 400 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని ఐక్య‌రాజ్య‌సమితి తెలిపింది. ఉక్రెయిన్ మాత్రం 1,684 మంది గాయ‌ప‌డ్డార‌ని ప్ర‌క‌టించింది. మరోపక్క, ర‌ష్యా దాడులు ఆపాల‌ని ఐక్యరాజ్య సమితి మ‌రోసారి సూచించింది. చ‌ర్చ‌ల‌తో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని ఇత‌ర దేశాల ప్ర‌తినిధులు కూడా ఉక్రెయిన్‌-ర‌ష్యాకు సూచించారు. 


More Telugu News