షేన్‌వార్న్ ప్రాణాలు కాపాడేందుకు 20 నిమిషాలపాటు శ్రమించిన స్నేహితులు

  • ముగ్గురు స్నేహితులతో థాయ్‌లాండ్‌లో ఉన్న వార్న్
  • డిన్నర్‌కు వెళ్లగా అచేతనంగా ఉన్న వార్న్‌ను చూసి షాక్
  • వెంటనే సీపీఆర్ చేసి అంబులెన్స్‌కు ఫోన్
  • ఆస్ట్రేలియాకు భౌతికకాయం తరలించే యత్నాలు  
ఆస్ట్రేలియన్ దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ హఠాన్మరణం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 52 ఏళ్ల వయసులోనే ఈ స్పిన్ మాంత్రికుడు ఇక లేడన్న విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో అచేతనంగా పడి వున్న వార్న్‌ను బతికించుకునేందుకు ఆయన స్నేహితులు దాదాపు 20 నిమిషాలపాటు శ్రమించారని థాయ్ పోలీసులు తెలిపారు. 

మరో ముగ్గురు స్నేహితులతో కలిసి వార్న్ కో స్యామ్యూయ్‌‌ లోని విల్లాలో ఉన్నారు. వార్నర్ ఇంకా డిన్నర్‌కు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితుల్లో ఒకరు పిలుచుకొచ్చేందుకు వెళ్లాడు. అక్కడి దృశ్యాన్ని చూసి అతడు షాకయ్యాడు. వార్న్ అచేతనంగా పడి ఉండడంతో తొలుత ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తర్వాత వెంటనే సీపీఆర్ (గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వ్యక్తిలో రక్త ప్రసరణ, శ్వాసప్రక్రియను పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నం) చేసి వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు.

మరోవైపు, విషయం తెలిసి విల్లాకు చేరుకున్న అత్యవసర ప్రతిస్పందన బృందం మరో 10- 20 నిమిషాలపాటు సీపీఆర్ చేసింది. ఆ తర్వాత కాసేపటికే థాయ్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ అంబులెన్స్ కూడా విల్లాకు చేరుకుంది. వైద్య సిబ్బంది మరో ఐదు నిమిషాలపాటు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో వార్న్ చనిపోయినట్టు ప్రకటించారు. 

వార్న్ మృతికి కచ్చితమైన కారణం తెలియరాలేదని, అంతమాత్రాన తాము అనుమానించడం లేదని థాయ్ పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్ మాట్లాడుతూ.. అధికారులు థాయ్‌లాండ్‌లోని వార్న్ స్నేహితులతో మాట్లాడారని తదుపరి సాయం అందించేందుకు శనివారం కో స్యామ్యూయ్‌కు వెళతారని చెప్పారు.

వార్న్ భౌతిక కాయాన్ని ఆస్ట్రేలియాకు రప్పించేందుకు థాయ్ అధికారులతో మాట్లాడుతున్నట్టు ఆమె తెలిపారు. శుక్రవారమే మరణించిన  74 ఏళ్ల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ రాడ్ మార్ష్‌కు నివాళి అర్పిస్తూ వార్న్ ట్వీట్ చేశాడు. అదే అతడి చివరి ట్వీట్!


More Telugu News