చంద్ర‌బాబు రైతు రాబందు.. ఏపీ మంత్రి క‌న్న‌బాబు

  • చంద్ర‌బాబు రైతు బంధు కాలేరు
  • రైతుల‌పై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీది
  • రైతుల‌కు ఎస్ఈజెడ్ భూములు తిరిగిచ్చిన ఘ‌న‌త వైసీపీది
  •  రైతులకు ఉచిత పంటల బీమా చేయించిన ఘనత కూడా తమదేనన్న కన్నబాబు  
టీడీపీ అధినేత‌, ఏపీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడుపై ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ఘాటు కామెంట్లు చేశారు. చంద్ర‌బాబును రైతు రాబందుగా అభివ‌ర్ణించిన ఆయ‌న.. చంద్ర‌బాబు ఎన్న‌టికీ రైతు బంధు కాలేర‌ని వ్యాఖ్యానించారు.  ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌పై శ‌నివారం మంత్రి విరుచుకుప‌డ్డారు. అమ‌రావ‌తితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా క‌న్న‌బాబు తెలిపారు. 

రైతుల శ్రేయ‌స్సు గురించి మాట్లాడే అర్హ‌త చంద్ర‌బాబుకు లేద‌న్న క‌న్న‌బాబు.. ఆర్‌అండ్‌ఆర్‌ అడిగిన రైతులపై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీదని విరుచుకుప‌డ్డారు. వ్యవసాయ శాఖను మూసేయడానికి ఆ శాఖ ఏమన్నా టీడీపీ ఆఫీసా? అని కూడా చంద్రబాబుపై కన్నబాబు మండిపడ్డారు. 

ప్రజల ఆకాంక్ష మేరకే మూడు రాజధానులని, వేల కోట్ల రూపాయలు పంటలకు రుణం ఇచ్చిన ప్రభుత్వం త‌మ‌ద‌ని పేర్కొన్న క‌న్నబాబు.. భారతదేశ చరిత్రలో రైతులకు ఎస్ఈజెడ్ భూములు తిరిగి ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత త‌మ‌దేన‌ని.. రైతులకు ఉచిత పంటల బీమా చేయించిన ఘనత కూడా త‌మ‌దేన‌ని క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు.


More Telugu News