అబద్ధాలు వల్లె వేయడంలో తండ్రిని మించావు.. బావిలో కప్పలా బతకకు: లోకేశ్ పై విజయసాయిరెడ్డి ఫైర్

  • చంద్రబాబు గురించి మమత మాట్లాడలేదన్న లోకేశ్
  • ఎల్లో మీడియాను నమ్ముకోవద్దంటూ విజయసాయి సూచన
  • అప్పుడప్పుడు ఇంగ్లీష్ పేపర్లూ చూడాలని కామెంట్
పెగాసస్ వ్యవహారం మీద టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలను వల్లె వేయడంలో చిట్టి నాయుడు.. తన తండ్రిని మించిపోయాడంటూ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెగాసస్ పై అసలు మాట్లాడనేలేదా? అంటూ ప్రశ్నించారు. 

ఎల్లో మీడియాను నమ్ముకుని బావిలో కప్పలా బతకొద్దని హితవు చెప్పారు. అప్పుడప్పుడు జాతీయ మీడియా, ఇంగ్లిష్ పేపర్లనూ చూడాలని సూచించారు. బెంగాల్ అసెంబ్లీ వేదికగా పెగాసస్ పై మమత చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాల్లో పతాక శీర్షికలుగా కథనాలు వచ్చాయని చెప్పారు. 

కాగా, పెగాసస్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని మమతా బెనర్జీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీలో పెను దుమారమే రేగింది. టీడీపీ కౌంటర్ కూడా ఇచ్చింది. తాజాగా మమత వ్యాఖ్యలపై లోకేశ్ కూడా స్పందించారు. అసలు ఆమె చంద్రబాబు గురించి మాట్లాడనే లేదన్నారు. 

బెంగాలీలో ఆమె మాట్లాడిన వీడియోను.. బెంగాలీ వచ్చిన తన స్నేహితుడికి పంపిస్తే అసలామె చంద్రబాబు గురించి మాట్లాడనే లేదని అన్నాడని అన్నారు. లోకేశ్ చేసిన ఆ వ్యాఖ్యలపైనే విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు.


More Telugu News