హార్దిక్ కు టీమిండియా జట్టులో చోటు కష్టమే: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి

  • బౌలింగ్ చేసి కాస్తో కూస్తో సక్సెస్ అయితేనే పిలుపు
  • టాప్ 5లో చాలా మంది సమర్థులున్నారు
  • ఆరో స్థానం ఆల్ రౌండర్ కోసమే
  • జట్టు బ్యాటింగ్ చాలా బలంగా ఉందని కామెంట్
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి రావడం కష్టమేనని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో అతడిని ముంబై ఇండియన్స్ వదిలేసుకోవడంతో గుజరాత్ టైటాన్స్ జట్టు.. కెప్టెన్ గా చేసింది. అయితే, అతడు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేస్తాడా? అన్న దాని మీదే అందరూ అనుమానాలు పెట్టుకున్నారు. 

ఇదే విషయంపై రవిశాస్త్రి తాజాగా స్పందించాడు. ఒకవేళ అతడుగానీ మళ్లీ బౌలింగ్ చేయకుంటే వచ్చే టీ20 వరల్డ్ కప్ కు జట్టులో అతడికి చోటు దక్కదని తేల్చి చెప్పాడు. మరో అవకాశం రాదన్నాడు. ‘‘టాప్ 5లో చాలా మంది సమర్థులైన ఆటగాళ్లున్నారు. ఐదు లేదా ఆరో స్థానాల్లో రావాలనుకుంటే మాత్రం కచ్చితంగా అదనపు బలం తెచ్చేలా ఉండాల్సిందే. అందుకే ఇటు హార్దిక్ దృష్ట్యా, భారత్ దృష్ట్యా, గుజరాత్ టీమ్ దృష్ట్యా అతడి బౌలింగ్ చాలా కీలకం. కనీసం మూడు ఓవర్లు వేసి.. కాస్తోకూస్తో సక్సెస్ చూపించినా.. అతడికి జట్టులో చోటు ఖాయం. బౌలింగే చేయలేదంటే.. ఇక కష్టమే’’ అని స్పష్టం చేశాడు. 

జట్టులో ఆరో స్థానం ఆల్ రౌండర్ దేనన్నాడు. ఐదో స్థానంలో ఎవరైనా రెండు లేదా మూడు ఓవర్లు బౌలింగ్ చేస్తే కెప్టెన్ కున్న సగం ఆందోళనలు తొలగిపోయినట్టేనని చెప్పాడు. జట్టులో బ్యాటింగ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, చాలా పటిష్ఠంగా ఉందని అన్నాడు. ఫాస్ట్ బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగైందని తెలిపాడు.


More Telugu News