మైదానంలో కమిన్స్ సునామీ.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిన ముంబై

  • ఐపీఎల్‌లో ఇంకా బోణీ కొట్టని ముంబై
  • 15 బంతుల్లో 56 పరుగులు చేసిన కమిన్స్
  • 16 ఓవర్లలోనే విజయాన్ని అందుకున్న కోల్‌కతా
  • ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం
ఐదుసార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్‌కు ఈసారి కలిసి రావడం లేదు. మూడు మ్యాచ్‌లు ఆడినా ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తడబడుతున్న రోహిత్ సేన వరుస ఓటములు అభిమానులను కలవరపెడుతున్నాయి. తాజాగా గత రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు పరాభవం ఎదురైంది. మరోవైపు, మూడు మ్యాచుల్లోనూ నెగ్గిన కోల్‌కతా ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

గత రాత్రి పూణెలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులు) అర్ధ శతకంతో రాణించగా.. తిలక్‌ వర్మ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్‌), పొలార్డ్‌ (5 బంతుల్లో 3 సిక్సర్లతో 22 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (14), డెవాల్డ్ బ్రేవిస్ (29) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం 162 పరుగుల ఓ మాదిరి లక్ష్య ఛేదనలో కోల్‌కతా తొలుత కొంత తడబడినప్పటికీ ఆ తర్వాత కుదురుకుంది. కమిన్స్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. దీంతో 16 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెంకటేష్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్‌) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ముంబై బౌలర్లలో మురుగన్‌ అశ్విన్‌, మిల్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.


More Telugu News