ఆరుగురు చనిపోయారనే వార్తతో తీవ్ర ఆవేదనకు గురయ్యాను: పవన్ కల్యాణ్

  • మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపిన పవన్ 
  • ఎల్జీ పాలిమర్స్ తరహాలో కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ 
  • ఒక్కో ప్రమాదానికి ఒక్కో తరహా పరిహారం ఇవ్వడం సరికాదన్న జనసేనాని 

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ కర్మాగారంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ముఖ్యమంత్రి జగన్ నష్టపరిహారాన్ని ప్రకటించారు. అయితే ఈ నష్టపరిహారం సరిపోదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. 

కష్టం మీద బతికే కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని పవన్ అన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చిన విధంగానే పోరస్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కో తరహాలో పరిహారాన్ని ఇవ్వడం సరికాదని అన్నారు. ఈ ఘటనలో మరో 13 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారని... వీరందరికీ మెరుగైన వైద్యం అందించి, న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 

రసాయన కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని.. భద్రత ప్రమాణాల నిర్వహణపై అధికారం యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.


More Telugu News