తెలంగాణ‌లో ఒంట‌రిగానే పోటీ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

  • 2023 చివ‌ర‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు
  • ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటుంద‌ని ప్ర‌చారం
  • ఆ ప్ర‌చారంపై క్లారిటీ ఇస్తూ రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌
  • ఒంట‌రిగానే బరిలోకి దిగి కేసీఆర్‌ను ఓడిస్తామ‌న్న రేవంత్‌
వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి... ఎన్నికల బ‌రిలో ఒంటరిగానే దిగ‌నున్న కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్‌ను చిత్తు చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. త‌ప్పుడు ప్ర‌చారాల‌ను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు న‌మ్మ‌వ‌ద్దంటూ రేవంత్ సూచించారు.

ఇటీవ‌లి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ప‌లుమార్లు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యానికి ప‌లు వ్యూహాల‌ను ఆయ‌న సోనియాకు అందించార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఖాయ‌మ‌న్న వార్త‌లు గ‌డ‌చిన రెండు రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమ‌యం నెల‌కొన‌గా... దానిపై క్లారిటీ ఇచ్చే దిశ‌గా తాజాగా రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.


More Telugu News