అనుమానాస్పద విమానం చక్కెర్లు.. జోబైడెన్ దంపతుల అత్యవసర తరలింపు
- డెలావేర్ బీచ్ ఒడ్డున నివాసంలో ఉండగా ఘటన
- పొరపాటున నిషిద్ధ ప్రాంతంలోకి వచ్చినట్టు గుర్తింపు
- తర్వాత తిరిగి అదే నివాసానికి అధ్యక్ష దంపతులు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ ను అత్యవసరంగా సురక్షిత ప్రదేశానికి తరలించారు. రెహెబోత్ బీచ్ (డెలావేర్) వద్ద వారిద్దరూ తమ నివాసంలో ఉన్న సమయంలో ఒక గుర్తు తెలియని చిన్న విమానం నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో భద్రతా సిబ్బంది ఆగమేఘాలపై బైడెన్, ఆయన జీవిత భాగస్వామిని అక్కడి నుంచి తరలించారు. వారికి ఎటువంటి ప్రాణహాని లేదని అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ప్రకటించింది.
నిషేధిత ప్రాంతంలోకి పొరపాటున వచ్చిన విమానాన్ని వెంటనే తమ నియంత్రణలోకి తీసుకున్నట్టు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ప్రకటించింది. భద్రతా విమానాలు గగనతనంలోనే సదరు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని అక్కడి నుంచి తరలించినట్టు తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇది జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన తర్వాత పరిస్థితిని అధ్యక్షుడు బైడెన్ సమీక్షించారు. అనంతరం తిరిగి బీచ్ ఒడ్డున ఉన్న తమ నివాసానికి తిరిగొచ్చేశారు. పైలట్ పొరపాటుగా ఆ ప్రాంతంలోకి విమానంతో ప్రవేశించాడని.. ఫ్లయిట్ రేడియో చానల్ సరిగాలేదని, ఫ్లయిట్ గైడెన్స్ ను కూడా అనుసరించలేదని గుర్తించారు.