నీలాంటోళ్లను చాలామందిని చూశా.. ఎమ్మెల్యే వంశీపై సీనియర్ నేత దుట్టా ఫైర్

  • భయపడి పారిపోయే రకాన్ని కాదన్న దుట్టా
  • పశువుల డాక్టర్ కాబట్టే పశువులా మాట్లాడుతున్నాడంటూ వంశీపై ఫైర్
  • సంస్కారం కోల్పోతే తట్టుకోలేవంటూ వంశీకి హెచ్చరిక
గన్నవరం ఎమ్మెల్యే వంశీ, ఆ పార్టీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అల్లుడు శివభరత్‌రెడ్డితో కలిసి నిన్న తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన రామచంద్రరావు.. తాను 39 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, వంశీలాంటి వాళ్లని ఎంతోమందిని చూశానని అన్నారు.

డొక్క చించుతా, డోలు చించుతా అంటే భయపడి పారిపోయే రకాన్ని కాదన్నారు. తాను ఎవరికీ భయపడబోనని, ఒంటరిగానే బయటకు వెళ్తానని, బాడీగార్డులతో తనకు పనిలేదని అన్నారు. ఎమ్మెల్యేగా కూడా ఒంటరిగానే పోటీ చేశానని, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులను కూడగట్టి పోటీ చేసే దుస్థితి తనకు రాలేదని అన్నారు. పశువుల డాక్టర్ కాబట్టి పశువులా మాట్లాడుతున్నావంటూ వంశీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తమకు సంస్కారం ఉందని, అది కోల్పోతే ఎలా ఉంటుందో ఊహించలేరని ఎమ్మెల్యే వంశీని హెచ్చరించారు. తాము రాయలసీమలో పుట్టామని, జగన్ ముఖం చూసి ఊరుకుంటున్నాం తప్పితే పౌరుషం లేక కాదని అన్నారు. గన్నవరంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా జడ్జి స్థాయిలో అధికారితో కమిటీ వేసి నిగ్గు తేల్చాల్సిందేనని  దుట్టా రామచంద్రరావు డిమాండ్ చేశారు.

బ్రోకర్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వల్లకాటికి పంపుతానంటూ బొమ్ములూరులో నిన్న వంశీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దుట్టా ఇలా స్పందించారు. గ్రామంలో నిర్వహించిన గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న వంశీ మాట్లాడుతూ.. శివభరత్‌రెడ్డి భార్య, దుట్టా రామచంద్రరావు కుమార్తె అయిన సీతామహాలక్ష్మి తాను పెట్టిన భిక్షతోనే జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అన్నారు. తమపై అసత్య ఆరోపణలు చేసే బ్రోకర్లు ఎదురుగా వచ్చి మాట్లాడితే వల్లకాటికి పంపిస్తానని వంశీ హెచ్చరించారు.


More Telugu News