విమానాలపై పెయింట్ రాలిపోతోందంటూ ఎయిర్ బస్ నుంచి రూ.7,800 కోట్ల పరిహారం కోరుతున్న ఖతార్ ఎయిర్ వేస్

  • ఖతార్ ఎయిర్ వేస్ వర్సెస్ ఎయిర్ బస్
  • ఎయిర్ బస్ నుంచి ఏ350 జెట్ విమానాల కొనుగోలు
  • పెయింట్ తొలగిపోతోందని ఖతార్ ఎయిర్ వేస్ ఆరోపణ
  •  మెరుపులు, పిడుగుల నుంచి ముప్పు ఉందని ఆందోళన
  • అదేమంత సమస్య కాదంటున్న ఎయిర్ బస్
విమానాల తయారీ దిగ్గజం ఎయిర్ బస్, ప్రముఖ విమానయాన సంస్థ ఖతార్ ఎయిర్ వేస్ మధ్య వివాదం చోటుచేసుకుంది. తాము ఎయిర్ బస్ నుంచి కొనుగోలు చేసిన ఏ350 విమానాలపై పెయింట్ రాలిపోతోందని ఖతార్ ఎయిర్ వేస్ ఆరోపిస్తోంది. 

పెయింట్ తొలగిపోవడం వల్ల మెరుపులు, పిడుగుల నుంచి విమానాలకు రక్షణ కల్పించే రాగి కవచం బహిర్గతమవుతోందని, ఇది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి అని ఖతార్ ఎయిర్ వేస్ చెబుతోంది. పెయింట్ తొలగిపోయిన విమానాలకు వాతావరణ పరంగా ముప్పు ఉండడంతో ఇప్పటికే 23 విమానాలను నిలిపివేశామని, తమకు ఎయిర్ బస్ రూ.7,800 కోట్లు పరిహారం రూపేణా చెల్లించాలని ఖతార్ ఎయిర్ వేస్ డిమాండ్ చేస్తోంది. 

అయితే, రంగు పోవడం నిజమేనని, కానీ అదేమంత ప్రమాదకరం కాదని ఎయిర్ బస్ వాదిస్తోంది. ఈ వాదనలకు యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) కూడా మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో, ఖతార్ ఎయిర్ వేస్ స్పందిస్తూ, ఎయిర్ బస్ కు అతిపెద్ద ఖాతాదారుగా ఉన్న తమ పట్ల ఇలా వ్యవహరించడం తగదని పేర్కొంటోంది. 

ఖతార్ ఎయిర్ వేస్ సీఈఓ అక్బర్ అల్ బాకర్ మాట్లాడుతూ, మార్కెట్లో తనకున్న పట్టును ఉపయోగించుకుని ఎయిర్ బస్ దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాగా, ఈ వివాదం ప్రస్తుతం లండన్ హైకోర్టు పరిధిలో ఉంది. గత మేలో చివరిసారిగా విచారణ జరిగింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలు కోరుకుంటున్నాయి.


More Telugu News